“ఇంగ్లండ్ (బ్రిటన్)ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన తెలుపుతున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ఇంగ్లండ్ (బ్రిటన్)ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన చేపట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): బ్రిటన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన చేపట్టారని చెప్పే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 6 అక్టోబర్ 2012న లండన్ నగరంలోని వెస్ట్‌మినిస్టర్‌లోని యూకే (UK) పార్లమెంట్ వెలుపల ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్ (Innocence of Muslims)’ అనే చిత్రానికి వ్యతిరేకంగా లండన్‌లోని ముస్లింలు చేసిన నిరసన ప్రదర్శనకు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఇటీవల బ్రిటన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన చేపట్టారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బ్రిటన్‌లోని ముస్లింలు గతంలో కానీ, ఇటీవల కానీ బ్రిటన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ఇలాంటి నిరసనలు బ్రిటన్‌లో జరిగి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి.
ఇకపోతే ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిచంగా, ఈ వీడియోలోని దృశ్యాలు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్ చుట్టుపక్కల ప్రదేశాలను చూపిస్తున్నట్లు, ఈ వీడియోలో కనిపిస్తున్న రిచర్డ్ కోర్ డి లయన్ లేదా రిచర్డ్ ది లయన్‌హార్ట్ (గుర్రం మీద ఒక యోధుడు) విగ్రహం ఆధారంగా మేము గుర్తించాము. దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే నిరసన ప్రదర్శనకు సంబంధించిన పలు వీడియోలు ‘takbeertv’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో 19 అక్టోబర్ 2012లో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఓ వీడియోలో వైరల్ వీడియోక్లిప్ లోనీ దృశ్యాలనే మరో కోణం(యాంగిల్) నుండి మనం చూడవచ్చు. ఈ వీడియోల వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు 2012లో లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ హౌస్ వద్ద ఇస్లామిక్ వ్యతిరేక చిత్రానికి వ్యతిరేకంగా లండన్‌లోని ముస్లింలు చేసిన నిరసన ప్రదర్శనకు సంబంధించినవి.
వైరల్ వీడియోను, ఈ యూట్యూబ్ వీడియోతో పోల్చి చూస్తే, వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇదే నిరసన కార్యక్రమానికి సంబంధించవిగా మనం నిర్ధారించవచ్చు.
ఈ నిరసన ప్రదర్శనకు సంబంధించిన మరింత సమాచారం కోసం సెర్చ్ చేయగా, ఇదే నిరసన ప్రదర్శనకు సంబంధించిన పలు ఫోటోలను మేము Alamy స్టాక్ ఇమేజ్ వెబ్సైటులో కన్నుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ). ఈ ఫొటోల వివరణ ప్రకారం, 6 అక్టోబర్ 2012న లండన్ నగరంలోని వెస్ట్‌మినిస్టర్‌లోని యూకే (UK) పార్లమెంట్ వెలుపల ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్(‘Innocence of Muslims)’ అనే చిత్రానికి వ్యతిరేకంగా లండన్‌లోని ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ చిత్రంలో మొహమ్మద్ ప్రవక్త పై అభ్యంతరకరం సన్నివేశాలు ఉన్నాయని ముస్లింలు నిరసన చేపట్టారు. 2012లో జరిగిన ఈ నిరసనలకు సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఇటీవల బ్రిటన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన తెలిపారని పేర్కొంటూ 2012లో ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్ (Innocence of Muslims)’ అనే చిత్రానికి వ్యతిరేకంగా లండన్‌లో జరిగిన ఓ నిరసన ప్రదర్శన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.