బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు రిపోర్ట్ అయిన నేపథ్యంలో, కొందరు వ్యక్తులు కలిసి ఇద్దరిపై కర్రలతో దాడి చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. బెంగాల్‌లో హిందువులపై ముస్లింల దాడి అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పైగా బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి అని కూడా కోరుతున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్‌లో హిందువులపై ముస్లింల దాడి చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2019 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అప్పట్లో పలు బంగ్లాదేశీ ఫేస్‌బుక్ పేజీలు ఆటో దొంగలించినందుకు ఇద్దరిని కొట్టారంటూ ఈ వీడియోను షేర్ చేసాయి. పైగా ఈ వీడియో ఇప్పుడు బెంగాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించింది అని చెప్పడానికి ఎక్కడా సమాచారం లేదు. 2019 నుండే అందుబాటులో ఉంది కాబట్టి ఈ వీడియో ఇప్పుడు బెంగాల్‌లో జరిగిన ఘర్షణలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు రిపోర్ట్ అయ్యాయి. బెంగాల్‌లోని హౌరా మరియు దల్ఖోలా ప్రాంతాల్లో కూడా హింస చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే పోస్టులో షేర్ చేసిన వీడియోకు ఇటీవల జరిగిన గొడవలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో 2019 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వీడియోను మార్చ్ 2019లో షేర్ చేసిన పలు బంగ్లాదేశీ ఫేస్‌బుక్ పేజీలు మాకు కనిపించాయి. దీన్నిబట్టి, ఈ వీడియో ఇప్పటిది కాదని స్పష్టమవుతుంది.
ఆటో దొంగలించినందుకు ఇద్దరి కొట్టారంటూ ఈ పేజీలు ఈ వీడియోను షేర్ చేసాయి. ఈ వీడియోను 2019లో షేర్ చేసిన పలు బంగ్లాదేశీ ఫేస్‌బుక్ పేజీలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే గతంలో ఈ వీడియో షేర్ అయినప్పుడు, ఈ ఘటనకు హిందూ-ముస్లిం కోణాన్ని ఆపాదిస్తూ ఎటువంటి క్లెయిమ్ ఐతే చేయలేదు.
ఐతే ఈ ఘటనకు సంబంధించి కారణాలు, ఎక్కడ జరిగిందో అన్న వివరాలు తెలియనప్పటికీ, 2019 నుండే అందుబాటులో ఉంది కాబట్టి ఈ వీడియో ఇప్పుడు బెంగాల్‌లో జరిగిన ఘర్షణలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఈ వీడియో ఇప్పుడు బెంగాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించింది అని చెప్పడానికి ఎక్కడా సమాచారం లేదు.
చివరగా, బెంగాల్‌లో హిందూవులపై ముస్లింల దాడి అంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు.