17 డిసెంబర్ 2024న రాజ్యాంగం పై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్ అంబేడ్కర్, అంబేడ్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది” అని అన్నారు (ఇక్కడ). అంబేడ్కర్‌ను అవమానించేలా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని, అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, పలు దళిత సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, “అంబేడ్కర్ గారిని అవమానపర్చిన అమిత్ షాని దళిత సంఘాలు తూర్పార పడుతుంటే..మందకృష్ణ ఈరోజు అమిత్ షా కి శాలువా కప్పి సత్కరించారు” అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 17 డిసెంబర్ 2024న, అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఇటీవల మందకృష్ణ మాదిగ శాలువాతో సత్కరించారు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): 17 డిసెంబర్ 2024 అనంతరం మందకృష్ణ మాదిగ అమిత్ షాను కలిసినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ఆధారాలు లేవు. ఈ వైరల్ ఫోటో 02 అక్టోబర్ 2023న MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అమిత్ షాతో సమావేశమైన సందర్భంగా తీసినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 17 డిసెంబర్ 2024న, అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఇటీవల అనగా 17 డిసెంబర్ 2024న అనంతరం మందకృష్ణ మాదిగ శాలువాతో సత్కరించారా లేదా కలిసారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, మందకృష్ణ మాదిగ ఇటీవల కలిసినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ఆధారాలు మాకు లభించలేదు.
ఇకపోతే ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోను రిపోర్ట్ చేస్తూ 02 అక్టోబర్ 2023న “అమిత్ షా తో మందకృష్ణ భేటీ.. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని వినతి” అనే శీర్షికతో ఆంధ్రప్రభ వార్త సంస్థ ప్రచరించిన వార్తాకథనం (ఆర్కైవ్డ్ లింక్) ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ ఫోటో 02 అక్టోబర్ 2023న ఎస్సీ వర్గీకరణపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అమిత్ షాను కలిసిన సమయంలో తీసినది.

మంద కృష్ణ మాదిగకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ పేజీ ఇదే ఫోటోను 02 అక్టోబర్ 2023న షేర్ చేశాయి. ఈ వైరల్ ఫోటో 02 అక్టోబర్ 2023న MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అమిత్ షాతో సమావేశమైన సందర్భంగా తీసినది అని మనం నిర్ధారించవచ్చు. అలాగే, 02 అక్టోబర్ 2023న అమిత్ షాతో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీకి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వైరల్ ఫోటో 02 అక్టోబర్ 2023 నాటిది. 17 డిసెంబర్ 2024 అనంతరం మందకృష్ణ మాదిగ అమిత్ షాను కలిసినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ఆధారాలు లేవు.