Fake News, Telugu
 

చత్తీస్‌గఢ్‌లో ఒక దళితుడిని చర్చిలోకి రావద్దని ఒక పాస్టర్ చితకబాదాడు అని ఒక సంబంధం లేని ఫొటోని షేర్ చేస్తున్నారు.

0

చర్చిలోకి రావద్దని ఒక పాస్టర్ ఒక 10 సంవత్సరాల దళిత బాలుడిని చితకబాదాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక గ్రాఫిక్ వైరల్( ఇక్కడ మరియు ఇక్కడ) అవుతోంది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది అని, ఆ బాలుడి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది అని సోషల్ మీడియా యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ విషయం వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ ఆర్టికల్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వైరల్ గ్రాఫిక్‌లో కనిపిస్తున్న 10 ఏళ్ల దళిత బాలుడిని చత్తీస్‌గఢ్‌లో ఒక పాస్టర్ చర్చిలోకి రావద్దు అని కొట్టాడు.

ఫ్యాక్ట్(నిజం): చత్తీస్‌గఢ్‌లో ఇటువంటి సంఘటన ఇటీవల జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇకపోతే వైరల్ గ్రాఫిక్ లో ఉన్న బాలుడి ఫోటో 2021లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక సంఘటనకు సంబంధించింది. ఏప్రిల్ 2021లో ఒక 10 ఏళ్ల బాలుడు జై శ్రీ రామ్ అని అనలేదు అని ఒక బీజేపీ కార్యకర్త కొట్టాడని చెప్పి ఈ ఫోటో రిపోర్ట్ అయింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్  ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా. ఇటీవల కాలంలో చత్తీస్‌గఢ్‌లో ఒక దళిత బాలుడిని కొట్టి ఒక పాస్టర్ చర్చిలోకి రానివ్వలేదు అని చెప్తున్న క్లెయిముకి రుజువుగా ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు.

వైరల్ గ్రాఫిక్‌లో ఉన్న ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం, ఆ ఫోటోని ఇంటర్నెట్లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు ఇదే ఫోటో ఉన్న 2021 నాటి కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) లభించాయి.

ఈ కథనాల ప్రకారం, ఏప్రిల్ 2021లో పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో మహదేవ్ ప్రమాణిక్ అనే ఒక బీజేపీ కార్యకర్త మహదేవ్ శర్మ అనే ఒక 10 ఏళ్ల బాలుడిని జై శ్రీ రామ్ అని అనడానికి నిరాకరించినందుకు కొట్టాడు.

దీనివల్ల మహదేవ్ గాయాలపాలై చికిత్స పొందడానికి ఆసుపత్రికి కూడా వెళ్లాల్సి వచ్చింది. మహదేవ్ శర్మ ఒక దళితుడు అని ఏ వార్తా కథనాల్లో ప్రస్తావించలేదు. ఈ సంఘటనకి చెందిన ఫోటోను, చత్తీస్‌గఢ్‌లో ఒక దళిత బాలుడిని ఒక పాస్టర్ కొట్టి చర్చిలోకి రానివ్వలేదు అనే ఒక కల్పిత కథకి జోడించి షేర్ చేస్తున్నారు.

ఏప్రిల్ 2021లో ది టెలిగ్రాఫ్ వారు ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం మహదేవ్ శర్మను కొట్టిన మహదేబ్ ప్రమాణిక్ అరెస్ట్ అయ్యాడు. బాలుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు అని ఈ వార్తా కథనంలో ఉంది. ఆ తర్వాత ఈ కేసు పరిస్థితి ఏమైంది అనే వివరాలు మాకు లభించలేదు.

చివరిగా, చత్తీస్‌గఢ్‌లో ఒక దళితుడిని చర్చిలోకి రావద్దని ఒక పాస్టర్ చితకబాదాడు అని ఒక సంబంధం లేని ఫొటోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll