అప్డేట్ (27 జనవరి 2025): 26 జనవరి 2025న అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర తను పుణ్య స్నానం చేశారని చెప్తూ, కొన్ని ఫోటోలను అఖిలేష్ తన ‘X’ అకౌంట్లో పోస్ట్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు(ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. అసలు వీటి వెనుక ఉన్న నిజం ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు.
ఫ్యాక్ట్(నిజం): అఖిలేష్ యాదవ్ ఇటీవల హరిద్వార్‌లో గంగా నది స్నానం చేసినప్పటి ఫోటోలు ఇవి. ఈ ఫోటోలను ఆయన 14 జనవరి 2025న తన ‘X’ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన కుంభ మేళాలో పాల్గొన్నట్లు 20 జనవరి 2025 నాటికి ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ పోస్టులో ఉన్న ఫోటోలను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఇవే ఫోటోలు మాకు అఖిలేష్ యాదవ్ ‘X’ అకౌంట్లో లభించాయి.
మకర సంక్రాంతి సందర్భంగా 14 జనవరి 2025 నాడు తను హరిద్వార్‌లో పుణ్య స్నానం చేసినప్పటి ఫోటోలు ఇవి అని ఆయన ఈ పోస్టులో చెప్పారు. అదనంగా, ఈ విషయం గురించి మాకు అనేక వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) కూడా లభించాయి.

ఈ కథనాల ప్రకారం మకర సంక్రాంతి సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్‌లో గంగా నది స్నానం చేసినప్పటి ఫోటోలు ఇవి. మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజ్ నగరంలో 13 జనవరి 2025న మొదలయ్యి 26 ఫిబ్రవరి 2025 వరకు జరగనుంది, ఉత్తరాఖండ్‌లో కాదు.

అలాగే, ఈ కథనం రాసే సమయానికి, అంటే, 20 జనవరి 2025 నాటికి అఖిలేష్ యాదవ్ ఈ ఏడాది మహా కుంభ మేళాలో పాల్గొన్నట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు.
చివరిగా, మహా కుంభమేళాలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు అని ఆయన హరిద్వార్‌లో గంగా స్నానం చేసిన ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు.