రామాయణ గానం చేస్తున్న ఇతర దేశాల పిల్లలు , అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. UK టాలెంట్ షో లో బ్రిటన్ దేశస్థులైన ఈ ఇద్దరు పిల్లలు రామాయణ సీరియల్ టైటిల్ సాంగ్ పాడినట్టు మరొక పోస్టులో క్లెయిమ్ చేసారు. అంతేకాదు, వీరిలో ఒకరు భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ అబ్బాయని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రామాయణం సీరియల్ పాటని UK టాలెంట్ షో లో ఇద్దరు బ్రిటన్ యువ గాయకులు పాడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ వీడియోలో Bars & Melody యువ పాప్ గాయకులు లియాంద్రే మరియు చార్లీ మానసిక బెదిరింపులకి వ్యతిరేకంగా ఇంగ్లీష్ భాషలో పాట పాడారు. ఈ పాటని ‘Britain’s Got Talent 2014’ ప్రోగ్రాంలో పాడారు. ఈ వీడియోలో పాడుతున్న యువ గాయకులిద్దరూ భారత దేశం మూలాలు కలిగిన వారు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘Popcorn’ అనే యూట్యూబ్ ఛానెల్లో దొరికింది. ఈ ఒరిజినల్ వీడియోలో ఆ యువ గాయకులు రామాయణం సీరియల్ పాట పాడలేదు. Bars & Melody పాప్ గాయకులు ‘Britain’s Got Talent’ షో లో మానసిక బెదిరింపులకి వ్యతిరేకంగా ఈ పాట పాడినట్టు వీడియో వివరణలో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ‘Britain’s Got Talent’ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఇదే వీడియో దొరికింది. Bars & Melody గ్రూప్ కి చెందిన యువ పాప్ గాయకులు లియాంద్రే మరియు చార్లీ ‘Britain’s Got Talent 2014’ షో లో పాడుతున్న దృశ్యాలని వివరణలో తెలిపారు. వీడియోలో ఈ గాయకులు ఇంగ్లీష్ భాషలో పాడుతుండటాన్ని మనం చూడవచ్చు. ‘Britain’s Got Talent’ 2014 ప్రోగ్రాంలో ఈ పాప్ గాయకులు ఇచ్చిన మరో ప్రదర్శనని ఇక్కడ చూడవచ్చు. ఒరిజినల్ వీడియోలోని ఆడియో క్లిప్ ని ఎడిట్ చేసి బ్రిటన్ దేశానికి చెందిన యువ గాయకులు రామాయణం సీరియల్ సాంగ్ పాడినట్టుగా షేర్ చేస్తున్నారు.
Bars & Melody (BAM) గ్రూప్ లోని Leondre Devries (Bar) మరియు Charlie Lenehan (Melody) యూకే లో పేరున్న పాప్ గాయకులు. Leondre Devris పుట్టి పెరిగింది UK లోని వేల్స్ లో. అలాగే, చార్లీ సౌత్ ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగారు. ఈ ఇద్దరిలో ఎవ్వరూ భారత దేశ మూలాలు కలిగి ఉన్న బ్రిటన్ వ్యక్తులు కాదు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోని చూపిస్తూ UK షో లో బ్రిటన్ యువ గాయకులు రామాయణం పాట పాడుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.