ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఒక అసభ్యకరమైన ఫోటో తెర పైకి వచ్చినందువల్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెరపైకి అసభ్యకరమైన ఫోటో వచ్చినందువల్ల అసహనం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఫాక్ట్: ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో రిమోట్ పనిచేయకపోవడంతో సిబ్బందిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వీడియోలో ఎక్కడా కూడా అసభ్యకరమైన ఫొటోలు తెరపైకి వచ్చినట్లు ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెతకగా, ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖకు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క పూర్తి వీడియో (ఆర్కైవ్) లభించింది. 09 జులై 2024 నాడు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ శ్వేత పత్రం యొక్క ముఖ్యాంశాలను చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఈ వీడియో ప్రత్యక్షప్రసారం చేసినట్లు గుర్తించాం.

పూర్తి వీడియోని పరిశీలించగా, 17:20 దగ్గర గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో వచ్చిన నష్టాల గురించి వివరిస్తున్న సమయంలో రిమోట్ పనిచేయకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అధికారులకు చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే, సంబంధం లేని ఒక అసభ్యకరమైన ఫోటో తెరపైకి రావడం వల్ల చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఎడిట్ చేయడం ద్వారా ఈ ఫొటోని వైరల్ వీడియోలోకి చొప్పించారు. చంద్రబాబు నాయుడు చెయ్యి, మైక్ ఈ ఫోటో వెనక ఉండడం వల్ల ఈ విషయాన్ని ధృవీకరించవచ్చు.

చివరిగా, చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఒక అసభ్యకరమైన ఫోటో తెరపైకి వచ్చిందంటూ ఒక ఎడిట్ చేయబడ్డ వీడియోని ప్రచారం చేస్తున్నారు.