ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్ చేస్తూ, మోదీ మాటలకు అందరూ చప్పట్లు కొడుతున్నారు గానీ కేవలం నితిన్ గడ్కరి మాత్రం చప్పట్లు కొట్టట్లేదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి నితిన్ గడ్కరి చప్పట్లు కొట్టకుండా కూర్చున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ క్లిప్‌ను 08 ఫిబ్రవరి 2023న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మోదీ చేసిన ప్రసంగం నుండి సేకరించారు. ఐతే ఈ ప్రసంగంలో సుమారు 53.50 నిముషాల వద్ద ప్రజల విశ్వాసాన్ని తాను ఎలా పొందానన్న విషయం గురించి మోదీ మాట్లాడుతుంటే మిగతా NDA ఎంపీలతో పాటు గడ్కరి కూడా బల్లలు చరుస్తాడు. ఐతే మధ్యలో కొన్ని సెకండ్లు ఆపి, మళ్ళీ తిరిగి చరుస్తాడు. ఐతే వైరల్ అవుతున్న వీడియోలో కేవలం గడ్కరి బల్లలు చరచడం ఆపిన కొన్ని సెకండ్లను మాత్రమే ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్, ప్రధాని మోదీ 08 ఫిబ్రవరి 2023న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా చేసిన ప్రసంగం నుండి తీసుకున్నారు.
ఈ ప్రసంగానికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రసంగంలో సుమారు 53.50 నిముషాల వద్ద ప్రజల విశ్వాసాన్ని తను ఎలా పొందానన్న విషయం గురించి మోదీ మాట్లాడుతుంటే మిగతా NDA ఎంపీలు బల్లలను చరుస్తూ కనిపిస్తారు. ఐతే ఈ సందర్భంలో నితిన్ గడ్కరి కూడా బల్లలను చరుస్తాడు. కాకపోతే మధ్యలో కొన్ని సెకండ్లు ఆపి, ఆ తరవాత మళ్ళీ చరుస్తాడు.
ఐతే నితిన్ గడ్కరి కొన్ని సెకండ్లు బల్లలను చరచడం ఆపిన క్లిప్‌ను మాత్రమే ఎడిట్ చేసి, మోదీ మాట్లాడుతుంటే గడ్కరి చప్పట్లు కొట్టట్లేదని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, నిజానికి మోదీ ప్రసంగం సమయంలో గడ్కరి అనేక సార్లు బల్లలను చరుస్తాడు.
చివరగా, మోదీ ప్రసంగానికి గడ్కరి చప్పట్లు కొట్టలేదని ఒక ఎడిట్ చేసిన క్లిప్‌ను షేర్ చేస్తున్నారు.