Fake News, Telugu
 

మహారాష్ట్రలోని మలంగ్ గఢ్ కోటలో ఉన్న ఈ వివాదాస్పద ప్రదేశంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ప్రార్ధనలు నిర్వహిస్తారు

0

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి…దమ్ము ఉన్నొడయ్యా ఎక్ నాథ్ షిండే.. దర్గా కి పోయి కాషాయం రంగు గల శాలువను కప్పిండు చూడు అది, అది కదా సెక్క్యూలరిజం అంటే’ అని చెప్తూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే ఒక దర్గా మాదిరిగా ఉన్న ప్రదేశంలో కాషాయ రంగు శాలువాను కప్పుతున్న దృశ్యాలతో ఉన్న విడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే ఒక దర్గాలో కాషాయ రంగు శాలువాను కప్పి, హారతి ఇచ్చారు.

ఫాక్ట్(నిజం): ఈ దర్గా మహారాష్ట్రలోని మలంగ్ గఢ్ కోటలో ఉంది. దీన్ని హాజీ మలంగ్ దర్గా అని అంటారు. కొందరు హిందువులు ఈ ప్రదేశాన్ని మచ్చింద్రనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి ప్రార్థనలు నిర్వహిస్తారు. వార్త కథనాల ప్రకారం ఎకనాథ్ షిండే ప్రతి ఏడాది మాఘ్ పూర్ణిమ సందర్భంగా ఈ ప్రదేశాన్ని దర్శిస్తారు.  అయన 2020లో ఇక్కడ పూజలు అర్పించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టుచేశారు. అయితే,  ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అక్కడికి వెళ్ళటం మొదటిసారి. అందుచేత ఈ పోస్టులో చెప్తున్నది తప్పుదోవ పట్టించేలా ఉంది.

 పోస్టులో చెప్తున్నట్లు ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే దర్గాకి వెళ్లి కాషాయ రంగు శాలువా అర్పించారు అని ఇంటర్నెట్లో తగిన సమాచారం కోసం వెతకగా, ఆయన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కళ్యాణ్ దగ్గర ఉన్న మలంగ్ గఢ్ కోటాలో ఉన్న మచ్చింద్రనాథ్ గుడిలో ‘మహా ఆర్తి’ పూజ నిర్వహించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వార్త కథనాలలో ఆయన కాషాయ రంగు శాలువా అర్పిస్తున్న దృశ్యాలని చూడవచ్చు.

మచ్చింద్రనాథ్ ఆలయం/ హాజీ మలంగ్ దర్గా యొక్క కథ

ఈ ఆలయం గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఆలయం దర్గా అని కూడా అంటారు అని, దీని వెనుక పెద్ద చరిత్ర ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్రాలో కొంకణ్ డివిజన్ వారి అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇక్కడ హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ పూజలు నిర్వహిస్తారు.

థానే జిల్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇది ఒక గుడి (మచ్చింద్రనాథ్ గుడి). ఈ ప్రదేశం హాజీ మలంగ్ అనేది ఒక ముస్లిం సన్యాసి యొక్క సమాధి కూడా. ఈ సన్యాసికి హిందువులు పూజలు అర్పిస్తారు. మగ్ పూర్ణిమ సందర్భంగా ఇక్కడ యాత్ర జరుగుతుంది.

అసలు, ఒకే ప్రదేశాన్ని రెండు పేర్లతో ఎందుకు పిలుస్తారు అని వెతకగా, ఈ స్థలం వివాదంలో ఉందంటూ వివరిస్తూ రాసిన బీబీసి వారి కథనం ఒకటి లభించింది. 2021లో ఇక్కడ రెండు వర్గాల మధ్య ఒక ఘర్షణ (ఇక్కడ మరియు ఇక్కడ) చోటు చేసుకొన్నప్పుడు బిబిసి ఈ కథనాన్ని ప్రచురించింది. 

ఈ  స్థలంలో 700 సంవత్సరాల క్రితం అరేబియా నుండి వచ్చిన  హాజీ అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి సమాధి ఉంది. కేట్కర్ అనే బ్రాహ్మణ వంశస్థులు ఈ మత స్థలం యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే, ఈ స్థలాన్ని హాజీ మలంగ్  అని పిలవకూడదని, శ్రీ మలంగ్ మలంగ్ గఢ్ అని పిలవాలి అని శివ సేన నాయకుడు ఆనంద్ దీఘే గతంలో ఒక పిలుపునిచ్చారు.

హాజీ మలంగ్ బాబా దర్గా ట్రస్ట్ యొక్క ప్రెసిడెంట్ నాసిర్ ఖాన్ బిబిసితో మాట్లాడుతూ ఈ దర్గాకి హిందువులు ముస్లింలు అందరూ వస్తారని, తమ ఈ దర్గాకి హిందూ బ్రాహ్మణులు ట్రస్టీలుగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా బిబిసితో బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషద్ సంస్థలకు సంబంధించిన నీలేష్ పాటిల్ మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు రెండు వర్గాల వారు ఇక్కడ ప్రార్థనలు అర్పించటానికి వస్తారు అని చెప్పారు. అంతే కాక, నీలేష్ మాట్లాడుతూ ఈ స్థలంలో మచ్చింద్రనాథ్ సమాధి ఉంది అని నమ్ముతున్నాము, ఇది ఆయన సమాధా లేక హాజీ అబ్దుల్ రెహమాన్ సమాధా అని కోర్టులో కేసు నడుస్తుంది అని చెప్పారు.

ఎకనాథ్ షిండే ఇక్కడకు మొదటి సారి వచ్చారా?

ప్రతి సంవత్సరం మఘ్ పూర్ణిమ సందర్భంగా ఇక్కడ ఒక తిరునాళ్ళు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవానికి గతంలో కూడా ఎకనాథ్ షిండే వీక్షించారు. 2018లో అయన ఈ ఉత్సవాన్ని ప్రారంభించినప్పటి చిత్రాలు నవ్ భరత్ టైమ్స్ వారు ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంతే కాకుండా ఎకనాథ్ షిండే ఫిబ్రవరి 2020లో కూడా ఇక్కడ ఆర్తి పూజ చేసారు. ఆయన ట్విట్టర్ లో ఈ పూజకు సంబంధించిన చిత్రాలని అప్లోడ్ చేసారు.

చివరిగా, మహారాష్ట్రలోని మలంగ్ గఢ్ కోటలో ఉన్న ఈ వివాదాస్పద మతప్రదేశంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ప్రార్ధనలు నిర్వహిస్తారు.

Share.

About Author

Comments are closed.

scroll