“ఫార్మా మాఫియా అమెరికాను నాశనం చేసింది. తమ ఏజెంట్ల ద్వారా భారత్‌లో కూడా అదే ఎజెండాను ఫార్మా మాఫియా అమలు చేయాలనుకుంది. కానీ, మోదీ గారు వారి ఆటలు సాగనివ్వలేదు. వారికి అడ్డుగోడలా నిలిచాడు”, అని ప్రసిద్ద అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ మలోని పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో ఫార్మా మాఫియాను ఎదుర్కొన్న తీరుని ప్రశంసిస్తూ అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ రాబర్ట్ మలోని చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్ (నిజం): అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ మలోని ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని ఉపయోగించి తమ రాష్ట్రంలో కరోనా వైరస్‌ని నియంత్రించిన విధానం గురించి చర్చించారు. కరోనా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగించిన ఔషధ కిట్టు సమాచారాన్ని నరేంద్ర మోదీ అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బయటపెట్టలేదని రాబర్ట్ మలోని ఈ పాడ్‌కాస్ట్‌లో ఆరోపించారు. భారత దేశంలో ఫార్మా మాఫియాకు సంబంధించి రాబర్ట్ మలోని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, అమెరికన్ వైరాలోజిస్ట్ మరియు ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ మలోని ఇటీవల జో రోగాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఉపయోగించిన ఔషధాల గురించి, ఉత్తరప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన సమావేశం గురించి చర్చించినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కరోనా బారిన పడిన రోగులకు ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని సూచించడం ద్వార కరోనా వైరస్‌ని నియంత్రించగలిగిందని రాబర్ట్ మలోని ఈ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా తమ రాష్ట్రంలోని ప్రజలకు ముందస్తు ఔషధ కిట్లని సమకూర్చిందని రాబర్ట్ మలోని తెలిపారు. అయితే, తమ రాష్ట్రంలో కరోనా రోగులకు అందించిన ఔషధ కిట్టు సమాచారాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదని రాబర్ట్ మలోని ఈ పాడ్‌కాస్ట్‌లో ఆరోపించారు.
అంతేకాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రించిన పద్ధతులు తెలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం జరిపినట్టు రాబర్ట్ మలోని ఈ పాడ్‌కాస్ట్‌లో ఆరోపించారు. నరేంద్ర మోదీ జో బైడెన్‌తో జరిపిన సమావేశంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన కరోనా నియంత్రణ పద్ధతులని తెలుపడానికి నిరాకరించారని రాబర్ట్ మలోని ఆరోపించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో లేదా, మరే ఇతర సందర్భంలో రాబర్ట్ మలోని భారత దేశంలో జరుగుతున్న ఫార్మా మాఫియా గురించి ప్రస్తావించినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.
ఐవర్‌మెక్టిన్ ముందస్తుగా ఉపయోగించడం వలన కరోనా పాజిటివ్, అలాగే మరణాల సంఖ్య నియంత్రించగలిగామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2021 మే నెలలో మీడియా ద్వారా ప్రకటించింది. కరోనా పాజిటివ్ రోగులకు ఐవర్‌మెక్టిన్ డ్రగ్ ఉపయోగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020 ఆగష్టు నెలలో ప్రభుత్వ అధికారులని ఆదేశించింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని ఉపయోగించడాన్ని గోప్యంగా పెట్టారని రాబర్ట్ మలోని చేసిన వాదన తప్పని స్పష్టమైంది. అంతేకాదు, రాబర్ట్ మలోని ఇటీవల వాక్సినేషనుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తప్పని పలు దేశ ప్రభుత్వాలు కూడా స్పష్టం చేసాయి.
చివరగా, భారతదేశంలో ఫార్మా మాఫియాకు సంబంధించి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ రాబర్ట్ మలోని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.