Fake News, Telugu
 

ఈ వీడియోలో ఉన్న పాటని ICUలో నుంచి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడలేదు

0

ICUలో నుంచి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట అని చెప్తూ, ఒక వీడియోని (ఆర్కైవ్డ్) సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలో అయన ICU లో ఉన్న ఫోటో పెట్టి, ఒక పాట ఆడియోని పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్ (దావా): ICUలో నుంచి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట.

ఫాక్ట్ (నిజం): వీడియోలో వినిపిస్తున్న పాటని 4 ఏప్రిల్ 2020 న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘ఈనాడు’ పత్రిక లో వచ్చిన ఒక కవిత అది. ఆ తరువాత కూడా చాలా పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూడవొచ్చు. అంతేకాదు, తాను ఆ పాట పాడింది ఏప్రిల్ నెలలో, ఆసుపత్రి లో చేరింది ఆగస్టు నెలలో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియో లోని ఆడియో యొక్క లిరిక్స్ కి సంబంధించిన మొదటి కొన్ని పదాలతో ఇంటర్నెట్ లో వెతకగా, అదే ఆడియోతో కూడిన వీడియోని ఒకరు ఏప్రిల్ లోనే యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన ఆడియో సరిగ్గా వింటే, ‘4 ఏప్రిల్ 2020 న ఉదయం ‘ఈనాడు’ వార్తాపత్రిక చదువుతుంటే రెండవ పేజీలో ‘మనిషిని నేను’ అని తంగెళ్ళ రాజ గోపాల్ రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చిందని చదివాను, ఆ పాట ఎందుకో పాడుకోవాలని అనిపించింది’, అని పాట మొదలు పెట్టక ముందు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టు వినొచ్చు. అయితే, ఆ భాగాన్ని ‘చివరి పాట’ అంటూ పోస్ట్ చేసిన వీడియోలో తీసేసారు. అంతేకాదు, 4 ఏప్రిల్ 2020 తరువాత కూడా చాలా పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూడవొచ్చు.

ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట గురించి ‘ఈనాడు’ మరియు ‘ఈటీవీ’ ప్రచురించిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, తను ఆ పాట పాడింది ఆసుపత్రి ఐసీయూ లో కాదు. ఎందుకంటే, బాలసుబ్రహ్మణ్యం ఆ పాట ని ఏప్రిల్ 2020 లో పాడారు. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 2020 లో ఆసుపత్రిలో చేరినట్టు ‘ఎంజీఎం’ ఆసుపత్రి వారు పెట్టిన ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని వీడియోలో ఉన్నది ఐసీయూ లో నుంచి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట కాదు. తను ఆ పాట ని ఏప్రిల్ 2020 లో పాడారు; ఆగస్టు 2020 లో ఆసుపత్రి లో చేరారు.

Share.

About Author

Comments are closed.

scroll