Fake News, Telugu
 

అక్టోబర్ 2023లో వరంగల్ జిల్లా శంభునిపేటకు చెందిన ఈ చిన్నారులు తప్పిపోయిన కొద్ది సేపటికే దొరికారు

0

వరంగల్ జిల్లా శంభునిపేట విశ్వనాథ కాలనీకి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ అయ్యారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా ఈ పిల్లలు వెతకి పట్టుకోవడంలో సహాయపడాలనే ఉద్దేశంతో ఈ వార్త/ఫోటో షేర్ అవుతుంది.  ఐతే ఈ కథనం ద్వారా ఈ  వార్తకు సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: వరంగల్ జిల్లా శంభునిపేట విశ్వనాథ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ అయ్యారు.

ఫాక్ట్(నిజం): వరంగల్ జిల్లా శంభునిపేటలో అక్టోబర్ 2023లో తప్పిపోయిన పిల్లలు ఇద్దరు కొంత సేపటికే దొరికారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పాత ఘటనకు సంబంధించిన వార్తను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు వరంగల్ జిల్లా శంభునిపేటలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ అయినట్టు అక్టోబర్ 2023లో కథనాలు (ఇక్కడ & ఇక్కడ) రిపోర్ట్ అయినప్పటికీ, ఆ పిల్లలు కొంతసేపటికే దొరికనట్టు మా రీసెర్చ్‌లో తెలిసింది. పైగా పోస్టులో చెప్తున్నట్టు ఆ పిల్లలు ఇద్దరు కిడ్నాప్ కాలేదు, కేవలం తప్పిపోయారు.

ఈ వార్తకు సంబంధించిన సమాచారం కోసం వరంగల్ జిల్లాలోని అజామ్ జాహీ మిల్స్ కాలనీ పోలీసులను సంప్రదించగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ శంభునిపేటలో పిల్లలు కిడ్నాప్ అయినట్టు పుకార్లు వ్యాపించింది నిజమేనని, కాకపోతే వాళ్ళు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయారని, కొంత సేపటికే పక్క వీధిలో దొరికారని తెలిపారు. అలాగే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.

ప్రస్తుతం ఈ వార్త/ఫోటోను షేర్ చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ, ఇలా అప్రస్తుతంగా పాత ఘటనలకు సంబంధించిన వార్తలను షేర్ చేయడం ద్వారా ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది.

చివరగా, వరంగల్ జిల్లా శంభునిపేటకు చెందిన ఈ చిన్నారులు అక్టోబర్ 2023లో తప్పిపోయిన కొద్ది సేపటికే దొరికారు.

Share.

About Author

Comments are closed.

scroll