Fake News, Telugu
 

పాత ఫోటో పెట్టి, అయోధ్య మందిరానికి అక్షయ్ కుమార్ 10 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

నటుడు అక్షయ్ కుమార్ మరియు ప్రధాని మోడీ కలిసి ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, రామ మందిర నిర్మాణానికి 10 కోట్ల విరాళం ఇచ్చిన అక్షయ్ కుమార్ అని అంటున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్య రామాలయ నిర్మాణానికి అక్షయ్ కుమార్ 10 కోట్ల రూపాయల విరాళం.

ఫాక్ట్ (నిజం): 2017 లో అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమా ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’ గురించి వివరించడానికి ప్రధాని మోడీని కలిసినప్పుడు తీసిన ఫోటో అది. అయోధ్య రామ మందిరానికి అక్షయ్ కుమార్ 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో మే 9, 2017 నుండి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నట్లుగా తెల్సింది. ఆ ఫోటో అనేక వార్తా పత్రికల కథనాల్లో ఉన్నపటికీ, దాని గురించి స్పష్టమైన సమాచారం తెలియలేదు. కానీ, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ లో ఒక వీడియో పోస్టులో పెట్టిన ఫోటో థంబ్ నేయిల్ గా ఉంది మరియు టైటిల్ లో ‘Akshay Kumar Met PM Modi & Discussed Toilet Ek Prem Katha’ అని ఉంది. ఆ సమాచారంతో నటుడు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ఖాతా లో అడ్వాన్స్డ్ సెర్చ్ చేసినప్పుడు ఒక ట్వీట్ లభించింది. దాని ద్వారా, 2017లో అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమా ‘టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ’ గురించి వివరించడానికి ప్రధాని మోడీని మే 9న కలిసారని తెలిసింది. ఆ ట్వీట్ లో వారు ఇరువురు ఆ సందర్భం లో దిగిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో మరియు పోస్టులోని ఫొటోలో వారిద్దరు వేసుకున్న చొక్కాల రంగుల ని చూస్తే, పోస్టులోని ఫోటో కూడా ఆ సందర్భంలోనే తీసినట్లుగా అర్ధం అవుతుంది. 

అంతేకాదు, అక్షయ్ కుమార్ అయోధ్యలో రామ మందిరం కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడా అని గూగుల్ లో వెతకగా, తను ఇచ్చినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. తను నిజంగా అలా ప్రకటిస్తే అన్ని ప్రముఖ వార్తాసంస్థలు ఆ వార్తను ప్రచురించేవి.

అయోధ్య రామ మందిరం పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ ట్రస్ట్ ని ఏర్పాటు చేయలేదు.

అంతేకాదు, అయోధ్య రామ మందిరం కోసం వీ.హెచ్.పీ మరియు శ్రీ రామ్ జన్మభూమి న్యాస్ వారు ఎటువంటి డొనేషన్స్ తీసుకోవట్లేదని వీ.హెచ్.పీ లీడర్ మీడియా కి తెలిపినట్టు ‘NDTV’ ఆర్టికల్ లో చూడవొచ్చు.

ఇంతకుముందు, ముకేష్ అంబానీ అయోధ్య రామ మందిరం కోసం 500 కోట్ల విరాళం ఇచ్చాడని ఒక ఫోటో వైరల్ అయినప్పుడు, అది తప్పని ‘FACTLY’ రాసిన కథనం ఇక్కడ చదవవచ్చు.

చివరగా, పాత ఫోటో పెట్టి, అయోధ్య మందిరానికి అక్షయ్ కుమార్ 10 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll