Fake News, Telugu
 

పాత ఫోటో పెట్టి, అయోధ్య మందిరానికి ముకేష్ అంబానీ 500 కోట్లు ఇస్తున్నట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు

1

‘అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్న ముకేష్ అంబానీ’ అని ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, మధ్యలో మరో 500 కోట్ల రూపాయలు ఇస్తానని అంబానీ చెప్పినట్టు పోస్ట్ లో పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలో అయోధ్య రామాలయ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్న ముకేష్ అంబానీ.    

ఫాక్ట్ (నిజం): 2017 లో ముంబై లో ‘CII’ వారు నిర్వహించిన రోడ్ షో లో పాల్గొనడానికి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ని ముకేష్ అంబానీ కలిసినప్పుడు తీసిన ఫోటో అది. అయోధ్య రామ మందిరానికి ముకేష్ అంబానీ 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని 2017 లో యోగీ ఆదిత్యనాథ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టినట్టు చూడవొచ్చు. ముంబై లో ‘CII’ వారు నిర్వహించిన రోడ్ షో సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ని కలిసినట్టు తన ట్వీట్ లో రాసాడు. ఆ ఈవెంట్ కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, ముకేష్ అంబానీ అయోధ్యలో రామ మందిరం కోసం 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడా అని గూగుల్ లో వెతకగా, తను ఇచ్చినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. తను నిజంగా అలా ప్రకటిస్తే అన్ని ప్రముఖ వార్తాసంస్థలు ఆ వార్తను ప్రచురించేవి.

అయోధ్య రామ మందిరం పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ ట్రస్ట్ ని ఏర్పాటు చేయలేదు.

అంతేకాదు, అయోధ్య రామ మందిరం కోసం వీ.హెచ్.పీ మరియు శ్రీ రామ్ జన్మభూమి న్యాస్ వారు ఎటువంటి డొనేషన్స్ తీసుకోవట్లేదని వీ.హెచ్.పీ లీడర్ మీడియా కి తెలిపినట్టు ‘NDTV’ ఆర్టికల్ లో చూడవొచ్చు.

చివరగా, పాత ఫోటో పెట్టి, అయోధ్య రామ మందిరానికి ముకేష్ అంబానీ 500 కోట్లు ఇస్తున్నట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll