Fake News, Telugu
 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఫోటోలని, అయోధ్య రైల్వే స్టేషన్ ఫోటోలని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

అట్టహాసంగా ముస్తాబై ఉన్న ఒక రైల్వే స్టేషన్ ఫోటోలు కొన్నిటిని అయోధ్య రైల్వే స్టేషన్ ఫోటోలని చెప్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ). వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం ఈ రైల్వే స్టేషన్ నవంబర్ 4వ తారీఖున ప్రారంభించారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

 క్లెయిమ్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ ఫోటోలు. 

ఫాక్ట్: ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఫోటోలు, అయోధ్య రైల్వే స్టేషన్ యొక్క నిజమైన రైల్వే స్టేషన్ ఫోటోలు కావు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ముందుగా, అసలు అయోధ్యలో నవంబర్ 4వ తారీఖున రైల్వే స్టేషన్ ఏమైనా ప్రారంభించారా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే, ఈ క్లెయిమ్ రుజువుపరిచేలాగా ఎటువంటి సమాచారం దొరకలేదు. కానీ కొన్ని ప్రముఖ మీడియా సంస్థల వార్త కథనాల (ఇక్కడ, ఇక్కడ ) ప్రకారం అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం థీమ్ లాగా తీసుకొని రూపుదిద్దుకొంటున్న (redevelopment) రైల్వే స్టేషన్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతుంది అని తెలిసింది.

రైల్వే మంత్రిత్వ శాఖ 2023 జూలైలో ఈ రైల్వే స్టేషన్ పనులు ఎంత వరకు వచ్చాయి అని తమ  X ద్వారా కొన్ని ఫోటోలతో కూడిన ఒక అప్డేట్ విడుదల చేశారు. ఈ ఫోటోలు వైరల్ ఫోటోల మాదిరిగా లేవు. 

అసలు వైరల్ అవుతున్న ఫోటోల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వాటిని రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోహిత్ మరియు అమర్ అనే సోషల్ మీడియా యూజర్లు తయారు చేసారని (ఇక్కడ, ఇక్కడ) తెలిసింది. ఇండియా టుడేతో మాట్లాడుతూ, ఈ ఫోటోలని తాను బింగ్ ఇమేజ్ క్రియేటర్ ఉపయోగించి తయారు చేసాడని మోహిత్ చెప్పాడు.

వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు అమర్ అనే వ్యక్తి తయారు చేసాడు అని మధ్య ప్రదేశ్ ఇండెక్స్ అనే X అకౌంట్ వారు వాటిని షేర్ చేశారు. 

చివరిగా, అయోధ్య రైల్వే స్టేషన్ నవంబర్ 4వ తారీఖున ప్రారంభం అవలేదు. వార్తా కథనాల్ని బట్టి అది జనవరి 2024లో తెరవబడుతుంది. వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడినవి, ఇవి అయోధ్య స్టేషన్ యొక్క నిజమైన ఫోటోలు కావు.

Share.

About Author

Comments are closed.

scroll