2023 ఏప్రిల్ నెలలో దేశంలోని అన్నీ రాష్ట్రాలలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 15 రోజులు సెలవులు తీసుకొనున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఏప్రిల్ నెలలోని 1, 2, 4, 5, 7, 8, 9, 14, 15, 16, 18, 21, 22, 23, 30 తేదీలలో దేశంలోని అన్నీ బ్యాంకులు సెలవులు తీసుకొనున్నాయంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2023 ఏప్రిల్ నెలలో దేశంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 15 రోజులు సెలవులు తీసుకోనున్నాయి.
ఫాక్ట్ (నిజం): RBI రిలీజ్ చేసిన 2023 సెలవుల లిస్ట్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలుపుకొని బ్యాంకులకు మొత్తంగా 15 రోజులు సెలవులు ప్రకటించింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా ప్రకటించిన మిగతా 8 రోజుల సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల బ్యాంకులకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరుపుకొనే పండగలని, ప్రముఖ వ్యక్తులు జయంతి వేడుకలని దృష్టిలో ఉంచుకొని RBI ఈ సెలవులని ప్రకటించింది. RBI సెలవుల లిస్ట్ ప్రకారం 2023 ఏప్రిల్ నెలలో తెలంగాణలోని బ్యాంకులు 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు 10 రోజులు సెలవులు తీసుకొనున్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం RBI వెబ్సైటులో వెతికితే, RBI రిలీజ్ చేసిన 2023 సెలవుల లిస్టు ప్రకారం ఏప్రిల్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలుపుకొని బ్యాంకులకు మొత్తంగా 15 రోజులు సెలవులు ప్రకటించినట్టు తెలిసింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా ప్రకటించిన మిగతా 8 రోజుల సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల బ్యాంకులకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరుపుకొనే పండగలని, ప్రముఖ వ్యక్తులు జయంతి వేడుకలని దృష్టిలో ఉంచుకొని RBI ఈ సెలవులని ప్రకటించింది.
తెలంగాణలోని బ్యాంకుల సెలవులు:
RBI 2023 సెలవుల లిస్ట్ ప్రకారం తెలంగాణలోని బ్యాంకులు ఆదివారాలు (2, 9, 16, 23, 30వ తేదీలు), శనివారాలు (8, 22వ తేదీలు) కాకుండా మరో నాలుగు రోజులు సెలవులు తీసుకొనున్నాయి. 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 7న గుడ్ ఫ్రైడే, 14న అంబేద్కర్ జయంతి, 22వ తేదీన (4వ శనివారం) రంజాన్ పండగ సందర్భంగా తెలంగాణ బ్యాంకులు సెలవులు తీసుకొనున్నాయి. 1వ తేదీన బ్యాంకులు తమ వార్షిక ఖాతాలు మూసివేయడానికి వీలు కల్పిస్తూ RBI సెలవు ప్రకటించింది. ఈ లెక్కన తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏప్రిల్ నెలలో మొత్తంగా 11 రోజులు సెలవులు తీసుకొనున్నట్టు స్పష్టమయ్యింది.
అంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల సెలవులు:
RBI 2023 సెలవుల లిస్ట్ ప్రకారం అంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు ఆదివారాలు, శనివారాలు కాకుండా మరో మూడు రోజులు సెలవులు తీసుకొనున్నాయి. అంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులు తెలంగాణ బ్యాంకుల లాగానే 1, 7, 14, 22 (రంజాన్ మరియు నాలగవ శనివారం) తేదీలలో సెలవులు తీసుకొనున్నాయి.
2023 ఏప్రిల్ నెలలో మొత్తంగా దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయని, కానీ వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ సెలవుల ఆధారంగా ఆయా ప్రాంతాల బ్యాంకుల సెలవులు మారుతుంటాయని ఇటీవల పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
చివరగా, RBI రిలీజ్ చేసిన సెలవుల లిస్ట్ ప్రకారం 2023 ఏప్రిల్ నెలలో బ్యాంకులు 15 రోజులు సెలవులు తీసుకోవడం లేదు.