Fake News, Telugu
 

హైదరాబాద్‌లో పోలీసులు నిరసనకారులను చెదరగొడుతున్న దృశ్యాలను ఉత్తరప్రదేశ్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్‌లో RSS వాళ్ళని చంపండి అని నినాదాలు ఇచ్చిన వారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు కొందరు వ్యక్తులను కొట్టుకుంటూ తీసుకెళ్లడం చూడొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో RSS వాళ్ళని చంపండి అని నినాదాలు ఇచ్చిన వారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):  ఆగస్ట్‌ 2022లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో శాలిబండలో నిరసనలు జరగగా, పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసారు.  వైరల్ అవుతున్న వీడియో ఈ ఘటనకు సంబంధించిందే. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌తో ఎటువంటి సంబంధంలేదు.  పైగా పోస్టులో చెప్తున్నట్టు ఈమధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకులు RSS వ్యతిరేక నినాదాలు చేస్తే, పోలీసులు వారిని కొట్టినట్టు ఎటువంటి వార్తా కథనాలైతే లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న వీడియో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించింది కాదు. ఇది ఒక పాత వీడియో. పైగా పోస్టులో చెప్తున్నట్టు ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు.

ఈ వీడియోకి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఇవే దృశ్యాలను 25 ఆగస్ట్ 2022లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో హైదరాబాద్‌లో శాలిబండకు సంబంధించింది.

2022 ఆగస్ట్‌లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  ముహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఆ సమయంలో రాజా సింగ్  వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాలిబండలో రాత్రి సమయంలో నిరసనలు జరగగా, పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు, పోస్టులో షేర్ చేసిన దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే.

శాలిబండలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్‌కు సంబంధించిన మరి కొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈమధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకులు RSS వ్యతిరేక నినాదాలు చేస్తే, పోలీసులు వారిని కొట్టినట్టు ఎటువంటి వార్తా కథనాలైతే మాకు లభించలేదు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చేస్తున్న వాదన కల్పితమే అని అర్ధం చేసుకోవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll