‘నలభై ఒక కోట్ల ప్రజల బ్యాంక్ అకౌంట్లో యాభై మూడు కోట్ల రూపాయలు వేసాము’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా Aaj Tak ఇంటర్వ్యూ లో చెప్పినట్టు ఒక స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: యాభై మూడు కోట్ల రూపాయలను నలభై ఒక కోట్ల ప్రజల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
ఫాక్ట్ (నిజం): ‘Aaj Tak’ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, నలభై ఒక (41) కోట్ల ప్రజల బ్యాంకు ఖాతాల్లో యాభై మూడు వేల (53000) కోట్లు ప్రభుత్వం వేసిందని చెప్పారు. దాన్ని ‘Aaj Tak’ తప్పుగా యాబై మూడు (53) కోట్లు అని టెలికాస్ట్ చేసింది. కావున, పోస్ట్ లో చెపింది తప్పు.
స్క్రీన్ షాట్ ఉన్న వీడియో కోసం వెతకగా, అది అమిత్ షా 29 మే 2020 న ‘Aaj Tak’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ అని గుర్తుంచడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో రిపోర్టర్, ‘కేంద్ర ప్రభుత్వం కొరోనా ని ఎదురుకోవడానికి ఇన్ని సహాయక చర్యలు చేపట్టినా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిరాశ వ్యక్తపరుస్తున్నారు?’ అని అడగగా, ఆ ప్రశ్నకి అమిత్ షా సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నియమాలు పాటిస్తూ వచ్చాయి, తాము ప్రవేశ పెట్టిన పథకాలతో ఎందరో పేదవారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. వీటిలో రాష్ట్ర బేధాలు చూడమని, అన్ని రాష్ట్రాలు సమానంగానే లబ్ది పొందుతారని చెప్పారు. దానికి ఉదాహరణగా కొరోనా నేపధ్యంలో ‘నలభై ఒక్క కోట్ల ప్రజల బ్యాంక్ ఖాతాల్లో యాభై మూడు వేల కోట్లు వేసాము’ అని చెప్పారు. ఈ విషయాన్ని అమిత్ షా తన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్చేసారు.
FACTLY విశ్లేషణలో Aaj Tak ఛానల్ యాభై మూడు వేల (53000) కోట్లని యాభై మూడు (53) కోట్లుగా తప్పుగా టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. తప్పుగా టెలికాస్ట్ చేసిన దృశ్యాన్ని 10:43:19 దగ్గర చూడవచ్చు. ‘Aaj Tak’ వారు కూడా టెలికాస్ట్ లో తమ వల్ల తప్పు జరిగిందని చెప్తూ తమ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసారు.
చివరగా, 41 కోట్ల ప్రజల ఖాతాల్లోకి 53,000 కోట్ల డబ్బులు ప్రభుత్వం వేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పాడు; పోస్టులో చెప్పినట్టు 53 కోట్లు కాదు. ‘Aaj Tak’ వారు తప్పుగా టెలికాస్ట్ చేసారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?