Fake News, Telugu
 

FSSAI ప్రమాణాల ప్రకారం భారత దేశంలో ఏదైనా చాక్లెట్ పదార్థాలలో బొద్దింక వ్యర్ధాలు కలపడానికి అనుమతి లేదు

0

మనం తినే ఏ చాక్లెట్‌లోనైనా నాలుగు శాతం బొద్దింక వ్యర్థాలు ఉంటాయని, కంపెనీలు నష్టపోయే డబ్బును దృష్టిలో ఉంచుకొని అమెరికా ఆహార నియంత్రణ సంస్థ (FDA) కూడా దీనికి అనుమతి ఇచ్చిందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇలా చాక్లెట్‌లలో వ్యర్థాలు కలవడం వల్ల మనషుల ఆరోగ్యం పాడవుతుందని వీడియోలో హెచ్చరిస్తున్నారు. ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్న విషయంలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మనం తినే ఏ చాక్లెట్‌లోనైనా నాలుగు శాతం బొద్దింక వ్యర్థాలు ఉంటాయి. FDA కూడా దీనికి అనుమతి ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): భారత దేశ ప్రభుత్వ సంస్థ FSSAI ప్రమాణాల ప్రకారం దేశంలో ఏదైనా చాక్లెట్ పదార్థాలు కలుషితాలు కలవడానికి అనుమతి లేదు. ఇంతకుముందు కూడా ఇలానే చాక్లెట్‌లలో బొద్దింక వ్యర్థాలు కలిసాయని వార్తలు వచ్చినప్పుడు FSSAI వాటిని ఖండించింది. కాగా అమెరికాకి చెందిన FDA మాత్రం చాక్లెట్‌ల తయారీలో ఏదో ఒక స్టేజీలో కీటక వ్యర్ధాలు కలవకుండా నియంత్రించడం కష్టమని అంగీకరిస్తూ, వినియోగదారుడికి హాని కలగకుండా చాక్లెట్‌ల తయారీలో పరిమిత కలుషితాలకు సంబంధించి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత దేశంలో తయారయ్యే లేదా విక్రయించే చాక్లెట్‌ ఉత్పత్తులలో ఎలాంటి కీటకాలు లేదా ఇతర కలుషితాలకు కలిపేందుకు అనుమతి లేదు. సాధారణంగా భారత దేశంలో ఆహార ప్రమాణాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నియంత్రిస్తుంది. అలాంటి FSSAI ప్రమాణాల ప్రకారం దేశంలో ఏదైనా చాక్లెట్ పదార్థాలు కీటకాలు, ఫంగస్, మురికి, కల్తీలు హానికరమైన పదార్థాలు మరియు ఇతర కలుషితాలు లేకుండా ఉండాలి (తయారు మరియు విక్రయం). ఒకవేళ ఈ  ప్రమాణాలకు విరుద్దంగా చాక్లెట్‌ల తయారీ/విక్రయం జరిగితే FSSAI వాటిని నిషేదిస్తుంది.

దీన్నిబట్టి దేశంలో చాక్లెట్‌లలో కీటకాలు లేదా ఇతర కలుషితాలను కలిపేందుకు అధికారికంగా అనుమతిలేదని మాత్రం స్పష్టమవుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే చాక్లెట్‌లలో బొద్దింకల వ్యర్థాలు కలుపుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో FSSAI వీటిని ఖండించింది.

చాక్లెట్‌లలో 4% కీటక వ్యర్ధాలను FDA అనుమతిస్తుంది ?

అమెరికా ఆహార నియంత్రణ సంస్థ FDA చాక్లెట్‌ల తయారీకి సంబంధించి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఐతే FDA  చాక్లెట్‌ల తయారీలో ఏదో ఒక స్టేజీలో కీటక వ్యర్ధాలు కలవకుండా నియంత్రించడం కష్టమని అంగీకరిస్తూ, వినియోగదారుడికి హాని కలగకుండా చాక్లెట్‌ల తయారీలో పరిమిత కలుషితాలకు సంబంధించి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఐతే వైరల్ పోస్టులో ఆరోపిస్తున్నట్టు FDA ఆర్ధిక లాభాల కోసం ఇలా కలుషితాలకు సంబంధించి ప్రమాణాలను నిర్దేశించలేదు.

FDA నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం 100 గ్రాముల చాక్లెట్‌లో సగటున 60 కీటక శకలాలు, 100 గ్రాములకు చాక్లెట్‌లో సగటున 1 ఎలుక వెంట్రుక కన్నా ఎక్కువ మోతాదులో కలుషితాలు ఉంటే FDA వాటిని నిషేదిస్తుంది. ఐతే ఈ ప్రమాణాల ఆధారంగానే పోస్టులో చెప్తున్న చాక్లెట్‌లో నాలుగు శాతం బొద్దింక వ్యర్థాలు కలుపుతారనే వార్త షేర్ అవుతుంది.

కాని చాక్లెట్‌ల తయారీకి సంబంధించి FDA నిర్దేశించిన ప్రమాణాలలో ఎక్కడ కూడా నాలుగు శాతం కీటక వ్యర్ధాలను అనుమతించలేదు. ఐతే చాక్లెట్‌ తయారీలో కలుషితాలను పూర్తిగా నిరోధించడం కష్టమన్న విషయాన్ని అంగీకరిస్తూ, వినియోగదారుడికి హాని కలగకుండా ఏ రకమైన కలుషితాలు ఏ మోతాదుకు లోబడి ఉండాలో నిర్దేశించింది.

ఐతే ఈ ప్రమాణాలలో ఎక్కడ కూడా బొద్దింక వ్యర్ధాల గురించి ప్రస్తావన లేదు. ఇదే అంశంపై FDA ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ పరిశోదనలో చాక్లెట్‌/ కోకో బీన్స్‌లో బొద్దింక అవశేషాలను గుర్తించలేదని, ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసింది.

చివరగా, భారత దేశ FSSAI ప్రమాణాల ప్రకారం దేశంలో ఏదైనా చాక్లెట్ పదార్థాలలో బొద్దింక వ్యర్ధాలు కలపడానికి అనుమతి లేదు.

Share.

About Author

Comments are closed.

scroll