Fake News, Telugu
 

2017లో రాంపూర్‌లో ఆడపిల్లల్ని వేధించిన ఘటనకు చెందిన వీడియోని ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో జరిగినదని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

వెస్ట్ బెంగాల్లో ముస్లిం అధికంగా ఉన్న ప్రాంతంలో, హిందు యువతుల పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా ఉందొ,,, ఇవన్నీ అక్కడ సర్వసాధారణం… రేపు మీ ఊరిలో… ఎల్లుండి మీ వాడలో’ అనే క్లెయిముతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు యువకులు ఇద్దరు ఆడపిల్లల్ని వేధిస్తూ, ఎక్కడబడితే అక్కడ పట్టుకుంటూ ఇబ్బంది పెట్టడం మనం చూడవచ్చు. ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ యువతుల దుస్థితిని చూపిస్తున్న వీడియో. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని సంఘటన అసలు పశ్చిమ బెంగాల్లోనే జరగలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో 2017లో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేసారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియోలో కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇదే సంఘటనకు సంబంధించిన కొన్ని వార్త కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ ) లభించాయి.

ఈ కథనాలను బట్టి, ఈ సంఘటన 2017లో ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో జరిగింది అని తెలిసింది. 14 మంది యువకులు ఇద్దరు ఆడపిల్లల్ని వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యింది. నిందితులపై పోలీసు వారు కేసు నమోదు చేసి, కొందర్ని అరెస్టు కూడా చేసారు.

గతంలో కూడా ఒకసారి ఇదే వీడియోను తెలంగాణలో జరిగిన సంఘటన అని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ సమయంలో మేము దాన్ని తప్పు అని చెప్తూ ఒక ఆర్టికల్ ప్రచురించాము. ఆ ఆర్టికల్‌ను ఇక్కడ చదవచ్చు.

చివరిగా, 2017లో రాంపూర్‌లో ఇద్దరు ఆడపిల్లల్ని కొందరు యువకులు వేధించిన ఘటనకు చెందిన వీడియోని ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితి అని  తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll