బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్, కుమిల్లాలో దుర్గా పూజ వేడుకల సందర్భంగా ఖురాన్‌ను అపవిత్రం చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా వ్యాపించడంతో అక్కడి ముస్లింలు హిందువులపై దాడి చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ రంగ్‌పూర్ జిల్లాలోని పిర్గంజ్‌లో ఒక హిందూ గ్రామానికి ముస్లిం మూకలు నిప్పు పెట్టాయంటూ ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమెంటో చూద్దాం.
క్లెయిమ్: బంగ్లాదేశ్ రంగ్‌పూర్ జిల్లాలోని పిర్గంజ్‌లో ఒక హిందూ గ్రామానికి ముస్లిం మూకలు నిప్పు పెట్టిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 12 అక్టోబర్ 2021న త్రిపురలోని మరా చెర్రా బజార్‌లో దుర్గా పూజ మండపానికి మంటలు అంటుకున్న ఘటనకి సంబంధించింది. ఈ ఘటనని అనేక లోకల్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లోని పిర్గంజ్‌లో హిందువుల ఇళ్ళకు నిప్పంటించిన సంఘటన జరిగినట్టు వార్తా కథనాలు ప్రచురించినప్పటికీ, ఈ వీడియో మాత్రం ఆ ఘటనకి సంబంధించింది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని షేర్ చేసిన పలు ఫేస్బుక్ పోస్టులు మాకు కనిపించాయి. ‘Today Tripura 24×7‘ మరియు ‘Social Tripura Network’ అనే పేజీలలో ఈ వీడియోని షేర్ చేయగా, ఈ పేజీలలో చెప్తున్న దాని ప్రకారం ఈ వీడియో త్రిపురలోని మరా చెర్రా బజార్‌లో ఒక దుర్గా మండపంలో మంటలు వ్యాపించిన ఘటనకు సంబంధించింది.
పైన తెలిపిన వివరాల ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోలోని ఘటనకు సంబంధించిన వార్తను ప్రచురించిన కొన్ని లోకల్ బెంగాలీ వార్తా కథనాలు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథానాల ప్రకారం 12 అక్టోబర్ 2021 నాడు కమల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరా చెర్రా బజార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దుర్గా పూజ మండపంతో పాటు పక్కనున్న నాలుగు షాప్స్ కూడా కాలిపోయాయి. ఐతే ఈ కథనాలలో మంటలు వ్యాపించడానికి గల కారణాలు పేర్కొనలేదు.
ఈ ఘటనకి సంబంధించిన వీడియో రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్ కూడా ఈ వీడియో మరా చెర్రా బజార్‌లో జరిగిన ఘటనగా ద్రువీకరిస్తుంది.
ఐతే ఇటీవల బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లా పిర్గంజ్‌లో హిందువుల ఇళ్లుకు కొందరు ముస్లింలు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు ఒక 16 ఇళ్ళకు నిప్పంటించారని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు పిర్గంజ్‌లో హిందువుల ఇళ్ళను తగలబెట్టిన వార్త నిజమైనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో మాత్రం ఆ ఘటనలకు సంబంధించింది కాదు.
చివరగా, త్రిపురలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోని బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.