Fake News, Telugu
 

బెంగళూరులో జరిగిన పాత ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి మార్ఫ్ చేసిన ఫోటోలు/వీడియోలు షేర్ చేస్తున్నారన్న కారణంతో TDP కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కాళ్ళు కట్టేసి కొడుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి మార్ఫ్ చేసిన ఫోటోలు/వీడియోలు షేర్ చేస్తున్నారన్న కారణంతో TDP కార్యకర్తలను పోలీసులు కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన 2019లో బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర్‌లో రిపోర్ట్ అయింది. సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక లైంగిక వేధింపుల కేసు నిందితుడిని ఇలా కాళ్ళు కట్టేసి కొట్టాడు. ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో చూపిస్తున్నట్టు పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న ఘటన రిపోర్ట్ అయిన వార్త నిజమే అయినప్పటికీ ఈ ఘటన బెంగుళూరులో రిపోర్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్‌లో కాదు. పైగా ఈ ఘటన ఐదేళ్ళ క్రితం రిపోర్ట్ అయింది.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2019లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక లైంగిక వేధింపుల కేసు నిందితుడిని ఇలా కాళ్ళు కట్టేసి కొట్టినట్టు తెలిసింది.

కథనాల ప్రకారం ఈ వీడియో వైరల్ అవడంతో ఉన్నత అధికారులు ఆ సబ్ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోను రిపోర్ట్ చేసిన మరొకొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాల బట్టి ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో మార్ఫింగ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా నిందితుడిని కొట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాకపోతే గతంలో ముఖ్యమంత్రి జగన్‌పై మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రదర్శించినందుకు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్టు కథనాలు ఉన్నాయి.

చివరగా, బెంగళూరులోని రిపోర్ట్ అయిన పాత ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll