“ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని కూడా చూడకుండా, ఒక సంతకం పెట్టలేదని డ్యూటీలో ఉన్న ఆఫీసర్ నీ కొట్టిన తెలుగుదేశం పార్టీ(TDP) గుండాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు మహారాష్ట్రకు సంబంధించినవి. వార్తా కథనాల ప్రకారం, వైరల్ వీడియో స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డే ఒక బ్యాంకు మానేజర్ ను చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటన 13 ఆగస్ట్ 2024న మహారాష్ట్రలోని జల్నా జిల్లా, జఫ్రాబాద్ తహసీల్ పరిధిలోని వరుద్ బుద్రుక్ అనే గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ 14 ఆగస్ట్ 2024న పబ్లిష్ చేసిన వార్తాకథనం ఒకటి లభించింది. ఈ కథనంలో మనం వైరల్ వీడియోలోని దృశ్యాలను చూపిస్తున్న ఫోటోను చూడవచ్చు. ఈ కథనం ప్రకారం, వైరల్ వీడియో స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డే ఒక బ్యాంకు మానేజర్ ను చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటన 13 ఆగస్ట్ 2024న మహారాష్ట్రలోని జల్నా జిల్లా, జఫ్రాబాద్ తహసీల్ పరిధిలోని వరుద్ బుద్రుక్ అనే గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో జరిగింది. పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు వంటి వివిధ బ్యాంకు సేవలను పొందడంలో బ్రాంచ్ మేనేజర్ సహకరించకపోవడంపై రైతులు, ఇతరుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని నిందితుడు మయూర్ బోర్డే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా వారి అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, “మహారాష్ట్రలో ఒక బ్యాంక్ మేనేజర్‌పై జరిగిన దాడిని ఏపీలో జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు” అని పేర్కొన్నది.
చివరగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీడీపీ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన దృశ్యాలు అంటూ మహారాష్ట్రలో ఒక బ్యాంక్ మేనేజర్‌పై జరిగిన దాడి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.