“ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించినవి. పలు వార్త కథనాలు ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా. బెల్ఘారియాలో పోలీసులు మాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, నిందితుడు, బాధితురాలు ఇద్దరు హిందూ మతానికి చెందినవారని స్పష్టం చేసారు. అలాగే ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా అని వారు మాకు తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కీఫ్రేములతో కూడిన ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India)’ వార్తాకథనం ఒకటి లభించింది. 05 సెప్టెంబర్ 2024న పబ్లిష్ అయిన ఈ వార్తా కథనం ప్రకారం, ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలోని ప్రఫుల్లానగర్‌లో 04 సెప్టెంబర్ 2024న జరిగింది. అభిజిత్ దత్తా అనే యువకుడు తన ప్రేమ నిరాకరించింది అనే కారణంతో ఓ మైనర్ బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశాడని, ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడిందని, స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని, స్థానికుల దాడిలో నిందితుడు కూడా గాయపడ్డాడని, ఈ ఘటన గురించి సమాచారం అందుకన్నా స్థానిక బెల్ఘారియా పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారని, ఈ కథనం పేర్కొంది.
ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ రిపోర్ట్స్ కూడా ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా అని పేర్కొనాయి. అయితే ఈ ఘటనలో బాధితురాలు మైనర్ బాలిక కావడంతో ఆమె పేరును ఏ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదు.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం మేము బెల్ఘారియా పోలీసులను మేము సంప్రదించగా ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మరియు బాధితురాలు ఇద్దరు హిందూ మతానికి చెందినవారని స్పష్టం చేసారు. అలాగే ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా అని బెల్ఘారియా పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసుకి సంబంధించి ఫైల్ చేసిన FIR కాపీలో కూడా నిందితుడి పేరు అభిజిత్ దత్తా అని ఉంది . దీన్ని బట్టి ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు.