Fake News, Telugu
 

ఈ వీడియోలో పర్వతాలపై నడుస్తున్నది ఒక ఇరానియన్ సంచార తెగకి చెందిన కుటుంబం, రోహింగ్యాలు కాదు

0

ఒక వైరల్ పోస్ట్ ద్వారా కొంతమంది వ్యక్తులు పర్వత ప్రాంతాల గుండా వెళుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వతాల గుండా వెలుతూ పిల్లలను తమ వీపుపై మోస్తున్న మహిళలను, పురుషులను ఇందులో మనం చూడవచ్చు. పోస్ట్‌ యొక్క వివరణ వారిని అక్రమ మార్గాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలుగా వివరిస్తుంది, ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతను  తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: ఈ వీడియో మయన్మార్ నుండి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): ఈ దృశ్యాలు ఇరాన్‌లోని ఒక సంచార కుటుంబాన్ని చూపిస్తున్నాయి. దీనికి రోహింగ్యాలకు ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లిప్ గురించి మరింత తెలుసుకోవడానికి, మేము దానిలోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ మమ్మల్ని ఇదే వీడియో కలిగి ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి దారితీసింది ఈ పోస్టు వివరణ వీడియోలో కనిపించే వ్యక్తులను ఇరాన్‌కు చెందిన భక్తియారీలుగా (bakhtiari) వర్ణించింది.

దీన్ని క్లూగా తీసుకుని, మేము అసలు వీడియో కోసం ఇంటర్నెట్‌లో వెతుకగా, ఇరాన్‌లోని సంచార జాతులకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసే DENA అనే ​​యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వైరల్ వీడియో యొక్క క్లిప్స్ కలిగి ఉన్న ఒక వీడియో దొరికింది. దాదాపు 43 నిమిషాల ఈ వీడియోలో కొన్ని విజువల్స్ వైరల్ క్లిప్‌లో ఉన్నాయి. 12 మార్చి 2023న అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియో టైటిల్  ‘Risk for life. Iranian nomadic family’. వైరల్ వీడియోలోని విజువల్స్ మరియు ఒరిజినల్ వీడియో మధ్య పోలికను మీరు క్రింది కోల్లెజ్‌లో చూడవచ్చు.

వీడియోలో ప్రత్యేకంగా ఈ  తెగ పేరును ప్రస్తావించనప్పటికీ (మేము మొదట కనుగొన్న ఇన్‌స్టాగ్రామ్ వీడియో వారు భక్తియారీ ప్రజలు అని చెబుతుంది), మయన్మార్ నుండి రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు ఈ వీడియో చూపించట్లేదు కాబట్టి, ఈ వీడియోలోని క్లిప్‌లు ఉపయోగించి తప్పుగా ఇందులోని వారిని రోహింగ్యాలు అని చెప్పి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవొచ్చు.

చివరిగా, వైరల్ వీడియో రోహింగ్యాలు మయన్మార్ దేశం నుండి భారతదేశానికి దొడ్డి దారిలో వస్తున్న దృశ్యాలని చూపట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll