Fake News, Telugu
 

ఈ ఫోటోలోని ఆలయం మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో కాదు

0

కర్ణాటకలో, శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరించి, పూజలకు సిద్ధం చేస్తున్న స్థానికులు అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో స్థానికులు పునరుద్ధరించిన ఆలయం యొక్క ఫోటో.

ఫాక్ట్: ఫోటోలోని ఆలయం మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో కాదు. కస్బా, సంగమేశ్వర్‌ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. సుమారు 1108 ADలో, అనేక మంది భక్తులు కస్బా సంగమేశ్వర్‌లో దాదాపు 306 దేవాలయాలను నిర్మించారు. సంగమేశ్వర్‌లో ఇటువంటి పురాతన ఆలయాలను పునరుద్ధరించి, శుభ్రం చేయడానికి కొంతమంది విద్యార్థులు 2016లో అక్కడికి వెళ్లారు. కానీ, అక్కడి స్థానికులు ఆలయాలను పునరుద్ధరించి, పూజలకు సిద్ధం చేసారనడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కర్ణాటకలో స్థానికులు, శిథిలావస్థలో ఉన్న కొన్ని పురాతన ఆలయాలను పునరుద్ధరించారని ఇటీవల న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.      

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో రత్నగిరి టూరిజం వెబ్సైటులో లభించింది. రత్నగిరి మహారాష్ట్రలో ఒక జిల్లా. కస్బా, సంగమేశ్వర్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయాలు ఉన్నాయని, 1108 ADలో, అనేక మంది భక్తులు కస్బా సంగమేశ్వర్‌లో దాదాపు 306 దేవాలయాలను నిర్మించారని వెబ్సైటులో తెలిపారు.

మహారాష్ట్రలోని సంగమేశ్వర్‌లో ఇటువంటి పురాతన ఆలయాలను పునరుద్ధరించి, శుభ్రం చేయడానికి కొంతమంది విద్యార్థులు 2016లో అక్కడికి వెళ్ళారని ఒక మరాఠీ రిపోర్ట్ లభించింది. కానీ, అక్కడి స్థానికులు ఆలయాలను పునరుద్ధరించి, పూజలకు సిద్ధం చేసారనడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

కర్ణాటకలో స్థానికులు, శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరించారని ఇటీవల కొన్ని వార్తా పత్రికలు రిపోర్ట్ చేసాయి. (ఇక్కడ మరియు ఇక్కడ). దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరిన 500 ఏళ్ల నాటి ఆలయాన్ని పునరుద్ధరించాలని ధార్వాడ్‌లోని వరూరు వాసులు అనుకున్నారు, చాలావరకు చేసారు కూడా.

చివరగా, మహారాష్ట్రలోని ఆలయం ఫోటోని పెట్టి కర్ణాటకలో స్థానికులు పునరుద్ధరించిన ఆలయం యొక్క ఫోటో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll