Fake News, Telugu
 

అస్సాంకి సంబంధించిన వీడియోని జార్ఖండ్ రాష్ట్రంలోని పాఠశాలలో విద్యార్థులు నమాజ్ చేస్తునట్టు షేర్ చేస్తున్నారు

0

“జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో 75 శాతానికి ముస్లిమ్స్ చేరుకోగానే వారే ఆ పాఠశాలపై పూర్తిగా అజమాయిషీ చలాయిస్తూ, పాఠశాలలో కూడా నమాజ్ చదివిస్తున్నారు, చేతులు జోడించి ప్రార్థన చేయడం కూడా నిషేధించినారు.” అని చెప్తూ ఒక విద్యార్థి అందరి విద్యార్ధుల ముందు అజాన్ ఇస్తున్న వీడియో ఫేస్బుక్ పోస్టు ద్వారా బాగా ప్రచారమవుతోంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో ముస్లిం జనాభా 75% చేరుకోగానే, వారు ఆ పాఠశాలలో చేతులు జోడించి ప్రార్థన చేయడం నిషేధించి, విద్యార్ధులతో నమాజ్ చదివిస్తున్నారు.  

ఫ్యాక్ట్ (నిజం): ఈ విడియోలోని ఘటన అస్సాంలో జరిగినది. పాఠశాలలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు వివిధ కళలు ప్రదర్శిస్తున్నప్పుడు ఒక విద్యార్థి అకస్మాత్తుగా అజాన్ ఇచ్చాడు. ఈ ఘటన పైన సంజాయిషీ ఇవ్వాలని ఆ సదరు ప్రిన్సిపాల్‌కు విద్యాశాఖ వారు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, జార్ఖండ్‌లోని కొన్ని ముస్లిం మెజారిటీ బడులలో చేతులు జోడించి ప్రార్థన చేయడం నిషేధించారు అని వార్తలు వచ్చాయి. అస్సాంలో జరిగిన ఘటనకు, జార్ఖండ్‌లో జరిగిన ఘటనలను ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వీడియోలో ఉన్న దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, దీనికి సంబంధించిన వార్తా కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పై కథనాల ప్రకారం, ఈ ఘటన అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని మారియాని అనే గ్రామ సమీపంలో ఉన్న ‘గ్యాన్ బికాశ్ ప్రాధమిక పాఠశాల’లో జరిగినది. ‘గుణోత్సవ్’ అనే కార్యక్రమంలో భాగంగా, అస్సాంలోని వివిధ పాఠశాలల పని తీరును ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తారు. అదే క్రమంలో ఈ పాఠశాలకు 3 జూన్ 2022న అధికారులు రావడం జరిగినది. పాఠశాల ప్రిన్సిపల్ ‘ప్రణబ్ అరంధర’ ప్రకారం,“అందరు విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా వివిధ కళలు ప్రదర్శించారు. ఒక విద్యార్థి అకస్మాత్తుగా పిల్లలు అందరి ముందు అజాన్ ఇచ్చాడు. ఇలా చెయ్యమని అతనికి ఎవరూ చెప్పలేదు. మాకు కూడా తెలీదు.” ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, జోర్హాట్ జిల్లా విద్యాశాఖ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంజాయిషీ అడుగుతూ, షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు కాపీని ఇక్కడ చూడవచ్చు.     

ఇక పోస్టులో క్లెయిమ్ చేసినట్లు, జార్ఖండ్‌ యొక్క గడ్వ జిల్లాలోని ఒక ముస్లిం మెజారిటీ పాఠశాలలో విద్యార్ధులు చేతులు జోడించి ప్రార్ధనలు చేయడం నిషేధిoచినట్లు కొన్ని న్యూస్ ఛానెళ్లు ప్రసారం చేశాయి.

జుంతార జిల్లాలోని కొన్ని బడులకు ఆదివారానికి బదులు శుక్రవారం సెలవు ఇస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. తర్వాత విద్యాశాఖ అధికారులు తిరిగి ఆదివారాన్ని మాత్రమే సెలవు దినంగా పాటించాలి అని ఆదేశించారు. దానికి సంబంధించిన కథనo ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, అస్సాంలోని పాఠశాలలో జరిగిన ఈ ఘటన వీడియోని జార్ఖండ్ రాష్ట్రంలోని పాఠశాలలో విద్యార్థులు నమాజ్ చేస్తునట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll