ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినందున యూపీ పోలీసులు అతన్ని రోడ్డుపై కొడుతూ తీసుకెళ్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినందున యూపీ పోలీసులు అతన్ని రోడ్డుపై కొడుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు.
ఫాక్ట్: వైరల్ వీడియోలోని మొదటి క్లిప్ మహారాష్ట్రలోని పర్భణీ నగరంలో జరిగిన ఘటనను చెందినది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన మహమ్మద్ అస్లాం సలీంను పోలీసులు అరెస్టు చేశారు. ఇక రెండో క్లిప్ మధ్య ప్రదేశ్‌కు చెందినది. అప్పు తీర్చలేదని వికాస్ అనే వ్యక్తి మధుర్ చౌరాసియా అనే వ్యక్తిని హత్య చేయగా, పోలీసులు వికాస్‌ను అరెస్టు చేసి రోడ్డుపై కొడుతూ తీసుకొని వెళ్లారు. ఇవి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఘటనలు కావు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా విద్యార్థినితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం చూపిస్తున్న క్లిప్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించిన స్థానిక వార్తా కథనాలు (ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 06 డిసెంబర్ 2024న, మహారాష్ట్రలోని పర్భణీ నగరంలో తోటి విద్యార్థినులతో రోడ్డుపై నడుచుకొని వెళ్తున్న ఒక విద్యార్థినితో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించి నానల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మహమ్మద్ అస్లాం సలీంను గుర్తించి అరెస్టు చేశారు.
అలాగే పోలీసులు రోడ్డుపై ఒక కొడుతూ తీసుకెళ్తున్న వీడియో గురించి వెతకగా, ఈ ఘటన గురించి రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్ జిల్లాలో జరిగింది. గతంలో తన దగ్గర తీసుకున్న ₹40,000 డబ్బుని తిరిగి ఇవ్వలేదని వికాస్ అనే వ్యక్తి మధుర్ చౌరాసియా అనే వ్యక్తిని 05 డిసెంబర్ 2024న హత్య చేశాడు. అయితే మధ్య ప్రదేశ్ పోలీసులు వికాస్‌ను కొద్ది గంటల్లోనే అరెస్టు చేసి ఇలా రోడ్డుపై కొడుతూ తీసుకువెళ్ళారు.
పై ఆధారాలను బట్టి, ఇవి రెండూ వేర్వేరు ఘటనలకు సంబంధించిన వీడియోలని, ఇవి ఉత్తర్ ప్రదేశ్‌కు సంబంధించినవి కావని నిర్ధారించవచ్చు.
చివరిగా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌లలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలను ఉత్తర్ ప్రదేశ్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు