Fact Check, Fake News, Telugu
 

సచార్ కమిటీ ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలలో భారీగా రిజర్వేషన్లు, 30% ఎంపీ స్థానాలు, 40% ఎమ్మెల్యే స్థానాలు రిజర్వ్ చేయాలని సిఫార్సు చేయలేదు

0

“2005లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం భారతదేశంలోని ముస్లింల ఆర్థిక స్థితిగతులను అంచనా కోసం నియమించిన సచార్ కమిటీ, ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు అనగా ఒక ముస్లిం 1 ఓటు వేస్తే అది 2 ఓట్లుగా లెక్కించబడుతుంది, భారతదేశంలోని ఎంపీ సీట్లలో 30% మరియు ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లలో 40% ముస్లింలకు రిజర్వ్ చేయాలి, ముస్లిం యువతుల పెళ్లికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు అందించాలని, ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను 50%కి పెంచాలి అని  పలు సిఫార్సులు చేసింది” అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సచార్ కమిటీ సిఫార్సులలో ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను 50%కి పెంచడం, ముస్లింలకు 30% పార్లమెంటరీ స్థానాలు మరియు 40% శాసనసభ స్థానాలు రిజర్వ్ చేయడం వంటివి ఉన్నాయి.

ఫాక్ట్(నిజం): ముస్లింల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సచార్ కమిటీ పలు సూచనలు చేసింది. అయితే వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు, భారీ రిజర్వేషన్‌లను సిఫార్సు చేయలేదు. మార్చి 2005లో, అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 17 నవంబర్ 2006న తన నివేదికను సమర్పించింది. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మార్చి 2005లో, అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీనినే సచార్ కమిటీ అంటారు. ఈ కమిటీ 17 నవంబర్ 2006న ‘భారత ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితి (Social, Economic, and Educational Status of the Muslim Community of India)’ అనే శీర్షికతో తన నివేదికను సమర్పించింది (ఇక్కడ). ఈ నివేదికలో సచార్ కమిటీ భారతదేశంలోని ముస్లింల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక సిఫార్సులు, సూచనలు మరియు పరిష్కారాలను చేసింది. ఈ కమిటీ చేసిన 76 సిఫార్సులు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి (ఇక్కడ). మనం వాటిని పరిశీలించి వైరల్ పోస్ట్‌లో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.

క్లెయిమ్ 1: ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు

సచార్ కమిటీ తన నివేదికలో ముస్లింలకు లేదా మరే ఇతర వర్గానికి ఓటు హక్కులో ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదు. భారత రాజ్యాంగం మతం, కులం లేదా లింగంతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించింది. అలాగే ఒక వ్యక్తికి, ఒక ఓటు మాత్రమే కల్పించింది. దీనికి లోబడే సచార్ కమిటీ పని చేస్తుంది. సచార్ కమిటీ కేవలం ఓటరు జాబితాలో చాలా వరకు ముస్లిం పేర్లు లేకపోవడాన్ని హైలైట్ చేస్తూ, దీని వల్ల వారికి కలిగే నష్టాలను వివరించింది.

క్లెయిమ్ 2: SC/ST మరియు OBCలతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి

సచార్ కమిటీ తన నివేదికలో షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలు (ST)తో సమానంగా ముస్లింలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలను సిఫార్సు చేయలేదు. కానీ, సచార్ కమిటీ తన నివేదికలో వెనుకబడిన ముస్లిం వర్గాలను ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ కింద చేర్చాలని సూచించింది. చాలా ముస్లిం వర్గాలు, ముఖ్యంగా అజ్లాఫ్‌లు మరియు అర్జల్‌లు సామాజిక-ఆర్థికంగా వెనకబడిన హిందూ OBCలతో సమానంగా ఉన్నారని, వారికి కూడా OBC లతో సమానంగా రిజర్వేషన్లు అందించాలని ఈ నివేదిక హైలైట్ చేసింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు కారణంగా SC రిజర్వేషన్ల నుండి అర్జల్ ముస్లింలను మినహాయించడాన్ని నివేదిక ఎత్తి చూపింది. అలాగే  అజ్లాఫ్‌ ముస్లింలను OBCల క్రింద, అర్జల్ ముస్లింలను SC లేదా అత్యంత వెనుకబడిన తరగతుల (MBC) కేటగిరీలో చేర్చడానికి పరిగణించాలని నివేదిక సూచించింది. ఈ సూచనలకు మద్దతుగా ముస్లింలకు రిజర్వేషన్లు లేదా సబ్-కోటాలు అమలు చేస్తున్న కేరళ మరియు కర్ణాటక వంటి రాష్ట్రల నమూనాలు ఉదాహరణలుగా ఈ నివేదికలో పేర్కొనబడ్డాయి.

క్లెయిమ్ 3: ముస్లింలు తీసుకున్న రుణాలలో 50% మాఫీ చేయడం మరియు ముస్లింలకు బడ్జెట్‌లో 20% కేటాయించడం

ప్రభుత్వం ముస్లింల బ్యాంకు రుణంలో సగం చెల్లించాలని మరియు భారతదేశ మొత్తం బడ్జెట్‌లో 20% ముస్లింల కోసం రిజర్వ్ చేయాలని సచార్ కమిటీ నివేదిక పేర్కొంది అనే వాదన తప్పు. ఈ నివేదిక ముస్లింలు బ్యాంకులు వంటి సంస్థాగత క్రెడిట్‌కు దూరంగా ఉండటం లేదా సులభంగా పొందలేకపోవడాన్ని హైలైట్ చేస్తూ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి పలు చర్యల ద్వారా ముస్లింలు ఆర్థిక ప్రయోజనాలు అందుకోవడానికి అవకాశాలను పెంచాలని సిఫార్సు చేసింది. అంతేకానీ,  కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వాలు  ముస్లింలు తీసుకున్న రుణాలలో 50% చెల్లించాలని సూచించలేదు. అదేవిధంగా, ముస్లింలతో సహా బలహీన వర్గాలకు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాలలో సమానమైన వనరుల కేటాయించాలని సిఫార్సు చేసింది. అంతేకానీ, ఈ నివేదిక జాతీయ బడ్జెట్‌లో నిర్ణీత శాతాన్ని ముస్లింలకు మాత్రమే కేటాయించాలని ఎక్కడ ప్రతిపాదించలేదు.

క్లెయిమ్ 4: IITలు మరియు IIMల వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ముస్లింలకు ఉచిత విద్య అందించాలి

IITలు మరియు IIMల వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ముస్లింలకు ఉచిత విద్య అందించాలి అని సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నలేదు. ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను పెంచడం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం మరియు నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడం ద్వారా ముస్లిం సమాజం యొక్క విద్యా వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంపై సచార్ కమిటీ ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. డ్రాపౌట్ రేట్లను తగ్గించడం, ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో మరిన్ని పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడం మరియు ప్రధాన స్రవంతి పాఠ్యాంశాలతో మదర్సా విద్యను ఏకీకృతం చేయడం ద్వారా ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడంపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. అంతేకాకుండా, భారత రాజ్యాంగం మరియు విద్యా హక్కు చట్టం అనుగుణంగా అక్షరాస్యతను మెరుగుపరచడం మరియు డ్రాపౌట్ రేట్లను తగ్గించడం వంటి జాతీయ లక్ష్యంలో భాగంగా ముస్లింలతో సహా పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం సచార్ కమిటీ నివేదిక సూచించింది.

క్లెయిమ్ 5: IAS/IPS/PCS వంటి పోటీ పరీక్షలలో ముస్లింల మదర్సా డిగ్రీని గుర్తించాలి

సచార్ కమిటీ తన నివేదికలో 22వ సిఫార్సులో మదర్సా విద్య యొక్క మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి పలు సూచనలు చేసింది. మతపరమైన అధ్యయనాలతో పాటు సైన్స్, గణితం మరియు ఆంగ్లం వంటి విషయాలను ప్రవేశపెట్టడం ద్వారా మదర్సా విద్యను ఆధునీకరించాలని సూచించింది. సివిల్ సర్వీసెస్, బ్యాంకులు, డిఫెన్స్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో అర్హత కోసం మదర్సాల నుండి పొందిన డిగ్రీలను కూడా గుర్తించాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది.

క్లెయిమ్ 6: ముస్లింలకు 30% ఎంపీ సీట్లు మరియు 40% ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ చేయడం

సచార్ కమిటీ నివేదిక భారతదేశంలోని మొత్తం ఎంపీ సీట్లలో 30% మరియు మొత్తం ఎమ్మెల్యే సీట్లలో 40% ముస్లింలకు రిజర్వ్ చేయాలని సిఫార్సు చేయలేదు. ఈ నివేదిక కేవలం రాజకీయలలో ముస్లింల తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని మాత్రమే ప్రస్తావించిది. అలాగే, ముస్లిం ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలను షెడ్యూల్డ్ కులాలు (SC) లకు రిజర్వ్ చేయకుండా నియోజకవర్గాల మరింత హేతుబద్ధమైన డీలిమిటేషన్ చేయడం వంటి పలు సూచనలు ఈ నివేదిక చేసింది. స్థానిక సంస్థలలో ముస్లిం భాగస్వామ్యాన్ని పెంచడానికి కూడా ఈ కమిటీ పలు సూచనలు చేసింది.

క్లెయిమ్ 7: ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 50% రిజర్వ్ చేయడం

భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బోర్డులు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు 50% రిజర్వ్ చేయాలని కమిటీ నివేదిక సిఫార్సు చేయలేదు. అయితే విద్య, ఆరోగ్యం, పోలీసు, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, దానిని పెంచాలని నివేదిక సూచించింది. ముఖ్యంగా ప్రజాలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న ఉద్యోగాలలో ముస్లింల ప్రాతినిధ్యం పెంచేందుకు మరింత పారదర్శకమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలు రూపొందించడం వంటి చర్యల ద్వారా ఎక్కువ మంది ముస్లింలు చేరేలా చేయాలని  నివేదిక సూచించింది.

క్లెయిమ్ 8: ముస్లింలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ప్రతి రాష్ట్రంలో ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్, భూమితో పాటు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు అందించాలి

ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక జోన్ల ఏర్పాటు లేదా ఉచిత విద్యుత్, ఉచిత భూమి మరియు రుణ రహిత రుణాలను అందించాలని సచార్ కమిటీ నివేదిక ప్రత్యేకంగా సిఫార్సు చేయలేదు. ఈ నివేదిక ముస్లింలకు ఆర్థిక వనరులు పరిమితంగా అందుబాటులో ఉందని పేర్కొంటూ ముస్లింలకు, ప్రత్యేకించి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలకు రుణాలు మరింత అందుబాటులో ఉండేలా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ముస్లిం-మెజారిటీ ప్రాంతాలలో, NABARD మరియు SIDBI వంటి సంస్థల ద్వారా సూక్ష్మ-క్రెడిట్ పథకాలు మరియు వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాలలో మెరుగైన ముస్లిం భాగస్వామ్యం పెంచాలని,  ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని శాఖలను తెరవడానికి బ్యాంకులను ప్రోత్సహించాలని ఈ నివేదిక సూచించింది. అంతేకానీ ఎక్కడా ఈ నివేదిక ముస్లింలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు అందించాలి పేర్కొనలేదు.

క్లెయిమ్ 9: ముస్లిం మహిళల వివాహాలకు ప్రభుత్వం నగదు సాయం అందించాలి

ముస్లిం యువతుల పెళ్లికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు అందించాలని, ముస్లిం యువకులు వ్యాపారాలు ప్రారంభించడానికి 10 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొనలేదు. అట్టడుగున ఉన్న ముస్లిం వర్గాలకు క్రెడిట్ యాక్సెస్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మెరుగుపరచడంపై నివేదిక పలు సిఫార్సులు చేసింది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న మరియు చిన్న వ్యాపారాల చేస్తున్న ముస్లింలకు బ్యాంకు క్రెడిట్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి మరియు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకోగల చర్యలను ఈ నివేదిక పేర్కొంది. ఆర్థిక వనరులను పొందడంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు ప్రభుత్వ పథకాలలో తగినంత భాగస్వామ్యం లేకపోవడం గురించి నివేదిక చర్చిస్తుంది.

క్లెయిమ్ 10: ముస్లిం జనాభా 25% కంటే ఎక్కువ ఉన్న ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లాలో ఎన్నికలలో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయబడాలి

ముస్లిం జనాభా 25% కంటే ఎక్కువ ఉన్న ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లాలో ఎన్నికలలో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయబడాలి అని సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొనలేదు. ఈ నివేదిక కేవలం రాజకీయలలో ముస్లింల తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని మాత్రమే ప్రస్తావించిది. అలాగే, ముస్లిం ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలను షెడ్యూల్డ్ కులాలు (SC) లకు రిజర్వ్ చేయకుండా నియోజకవర్గాల మరింత హేతుబద్ధమైన డీలిమిటేషన్ చేయడం వంటి పలు సూచనలు ఈ నివేదిక చేసింది.

ఫిబ్రవరి 2014 లో , సచార్ కమిటీ చేసిన 76 సిఫార్సులలో 72 సిఫార్సులను ఆమోదించినట్లు మరియు వాటిని అమలు చేయడానికి 43 నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పటి యుపిఎ (UPA) ప్రభుత్వం ప్రకటించింది. 2018 లో , సచార్ కమిటీ నివేదికలోని ఈ 72 ఆమోదించబడిన సిఫార్సుల ఆధారంగా దేశంలో అమలు చేయబడిన పథకాలు, కార్యక్రమాలు మరియు నిర్ణయాల జాబితాను NDA ప్రభుత్వం విడుదల చేసింది.

చివరగా, ముస్లింల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సచార్ కమిటీ పలు సూచనలు చేసింది, అయితే వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు లేదా భారీ రిజర్వేషన్‌లను సిఫార్సు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll