అయ్యప్ప మాల ధరించిన ఒక విద్యార్థిని కాన్వెంట్ స్కూల్లోకి రానివ్వకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంటున్నట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. “స్కూల్ బయట ఇలా ఉంటే, లోపల ఎలా ఉంటుందో ఊహించండి. హిందూ పిల్లల్ని ఎంత చిత్రహింసలు పెడుతుంటారో చూడండి” అని ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: అయ్యప్ప మాల ధరించిన ఒక విద్యార్థిని కాన్వెంట్ స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న స్కూల్ యాజమాన్యం.
ఫాక్ట్(నిజం): ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి కల్పిత వీడియోలని రూపొందించి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోను తయారు చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, 0.14 నిమిషాల వద్ద ఒక వివరణను గమనించాం. ఈ వివరణ ప్రకారం, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, దీన్ని కేవలం ప్రజలలో అవగాహన కల్పించడానికి రూపొందించినట్లు చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు నటి సంజనా గల్రానీ తన ఫేస్‌బుక్ పేజీలో 26 డిసెంబర్ 2024న “నో వర్డ్స్ టు సే” అనే శీర్షిక తో అప్‌లోడ్ చేసిన ఇదే వీడియోను (ఆర్కైవ్ లింక్) మేము కనుగొన్నాము.

ఈ వీడియో యొక్క వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, దీన్ని కేవలం ప్రజలలో అవగాహన కల్పించడానికి రూపొందించారాని చెప్తున్న ఒక వివరణ ఉండటం మేము గమనించాము. ఇదే వివరణ మనకి ఈ వీడియో యొక్క చివర్లో కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని స్పష్టమవుతుంది.
అదనంగా, స్క్రిప్టెడ్ వీడియోలని రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసే ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మాకు ఇదే వీడియో (ఆర్కైవ్ లింక్) లభించింది. ఈ వీడియోలో, ఇంకా వీడియో వివరణలో కూడా ‘వీడియో కేవలం వినోదం కోసం మరియు ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం తయారు చేశాం’ అని ఉంది.
3RD EYE మరియు సంజన అప్లోడ్ చేసిన స్క్రిప్టెడ్ వీడియోలను, గతంలో కూడా నిజమైన సంఘటనలకి చెందిన వీడియోలు అని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయగా, అవి నిజమైన సంఘటనలకి చెందిన వీడియోలు కావని చెప్తూ మేము ఫాక్ట్ చెక్ ఆర్టికల్స్ ప్రచురించాము. వాటిని ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని కాన్వెంట్ స్కూల్లోకి రానివ్వడం లేదు అని చూపిస్తున్న స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు.