Fake News, Telugu
 

మహిళను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ స్క్రిప్టెడ్ వీడియోను వాస్తవ ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

0

మహిళను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. “భారతదేశంలో 2019 నుండి 2021 మధ్యకాలంలో 13.13లక్షల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని కేంద్ర ప్రభుత్యమే చెప్పింది, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి”, అని చెప్తూ అదొక వాస్తవ ఘటనగా చూపిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.


ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఒక మహిళ కిడ్నాప్ దృశ్యాలు, అనేక మంది మహిళలు ఇలాగే కిడ్నాప్ అవుతున్నారు.

ఫాక్ట్(నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో.‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోని కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. కేంద్ర ప్రభుత్వం 26 జూలై 2023న రాజ్య సభలో మిస్సింగ్ వుమెన్ అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)  లెక్కల ప్రకారం దేశంలో 2019 నుండి 2021 మధ్యకాలంలో 13.13లక్షల మంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యమయ్యారని తెలిపింది. అయితే NCRB వెలువరించిన 2019, 2020, 2021 సంవత్సరాల క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ పరిశీలించగా,  ఇది కేవలం నమోదైన మిస్సింగ్ కేసుల సంఖ్య మాత్రమే అని, ఇలా కనిపించకుండా పోయినా వారిలో నుండి కొందరి ఆచూకీని కనిపెట్టారని, అలా ఆచూకీ లభించిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నట్లు తెలిసింది. NCRB లెక్కల ప్రకారం 2021 చివరి నాటికి వాస్తవంగా అప్పటి వరకి ఆచూకీ తెలియకుండపోయినా అమ్మాయిలు మరియు మహిళల సంఖ్య 2.03 లక్షలు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘3RD EYE’ యూట్యూబ్ ఛానెల్ 20 ఏప్రిల్ 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో చూపించిన వివరణలో ఈ వీడియోని కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు. ‘3RD EYE’ పబ్లిష్ చేసిన మరిన్ని స్క్రిప్టెడ్ వీడియోలను ఇక్కడ చూడవచ్చు.

అలాగే కేంద్ర ప్రభుత్వం 26 జూలై 2023న రాజ్య సభలో మిస్సింగ్ వుమెన్ అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB)  లెక్కల ప్రకారం దేశంలో 2019 నుండి 2021 మధ్యకాలంలో 13.13లక్షల మంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యమయ్యారని తెలిపింది. అయితే NCRB వెలువరించిన 2019, 2020, 2021 సంవత్సరాల రిపోర్ట్స్ పరిశీలించగా,  ఇది కేవలం నమోదైన మిస్సింగ్ కేసుల సంఖ్య మాత్రమే అని, ఇలా కనిపించకుండా పోయినా వారిలో నుండి కొందరి ఆచూకీని కనిపెట్టారని, అలా ఆచూకీ లభించిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నట్లు తెలిసింది. అంటే ఈ సంఖ్య వాస్తవంగా ఆచూకీ లభించకుండపోయిన అమ్మాయిలు మరియు మహిళల సంఖ్యను సూచించదు అని తెలిసింది. NCRB లెక్కల ప్రకారం అప్పటి వరకి ఆచూకీ తెలియకుండపోయిన అమ్మాయిలు, మహిళలలో నుండి 2019లో 2,22,949 మంది ఆచూకీ కనిపెట్టారు, 2020లో 2,24,043 మంది ఆచూకీ కనిపెట్టారు, అలాగే 2021లో 2,61,278 మంది ఆచూకీ కనిపెట్టారు. అంటే 2021 చివరి నాటికి వాస్తవంగా అప్పటి వరకి ఆచూకీ తెలియకుండపోయినా అమ్మాయిలు మరియు మహిళల సంఖ్య 2,03,893.

ఇంతకముందు కూడా ఇలాంటి కొన్ని వీడియోలు వాస్తవ ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, అవి కూడా స్క్రిప్టెడ్ వీడియోలని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, మహిళను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ స్క్రిప్టెడ్ వీడియోను వాస్తవ ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll