Fake News, Telugu
 

సంబంధంలేని వీడియోలను ప్రస్తుతం జరుగుతున్న రైతుల నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

0

ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు అందోళనల నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్తున్న రైతులకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోలు (ఇక్కడ & ఇక్కడ) అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.


ఇలాంటివే మరికొన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫిబ్రవరి 2024లో ఢిల్లీలో జరుగుతున్న రైతుల అందోళనలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న  వీడియోలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలకు ఫిబ్రవరి 2024లో ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియోలోని దృశ్యాలు 03 ఫిబ్రవరి 2024న సామాజిక కార్యకర్త భానా సిద్ధూపై పోలీసులు నమోదు చేసిన కేసులకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ వందలాది మంది యువకులు ట్రాక్టర్లతో బారికేడ్లను తొలగించుకుంటూ సంగ్రూర్‌లోని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్దకు ర్యాలీగా వెళ్లడాన్ని చూపిస్తున్నాయి. అలాగే రెండో వీడియో 17 జనవరి 2024 నుండే, అంటే 13 ఫిబ్రవరి 2024న ఢిల్లీలో రైతుల నిరసనలు ప్రారంభం కాకముందు నుండే ఇంటర్నెట్‌లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) కల్పించే చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, ఇంతకు ముందు జరిగిన రైతు నిరసనలో నమోదు చేసిన పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 13 ఫిబ్రవరి 2024న ‘ఢిల్లీ చలో’ రైతు నిరసన ర్యాలీకి పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

రైతు నిరసన ర్యాలీని అడ్డుకోవడానికి మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పలు రిపోర్ట్స్ (ఇక్కడ & ఇక్కడ) ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్తున్న రైతులకి సంబంధించిన వీడియోలు అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముందుగా మొదటి వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని Gemm TV  అనే ఫేస్‌బుక్ పేజీలో 3 ఫిబ్రవరి 2024న షేర్ చేసినట్లు తెలిసింది. వీడియో వివరణలో భానా సిద్ధూకు మద్దతుగా నిరసనలో పాల్గొనేందుకు యువకులు ట్రాక్టర్లతో వచ్చారు, బారికేడ్లు తొలగించి ముందుకు సాగడం ప్రారంభించారు. ఈ పరిస్థితి రైతుల ఉద్యమాన్ని తలపిస్తోంది’ అని పంజాబీలో రాశారు.

తదుపరి ఈ సమాచారం ఆధారంగా ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకితే, 03 ఫిబ్రవరి 2024న బీబీసీ పంజాబీ ప్రచురించిన వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం సామాజిక కార్యకర్త భానా సిద్ధూపై పోలీసులు నమోదు చేసిన కేసులకి వ్యతిరేకంగా నిరసన  వ్యక్తం చేస్తూ వందలాది మంది యువకులు సంగ్రూర్‌లోని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్దకు ర్యాలీగా వచ్చారు. అదేవిధంగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను కలిగిన వీడియోని ప్రో పంజాబ్ టీవీ కెనడా అనే యూట్యూబ్  ఛానల్ కూడా షేర్ చేసినట్లు తెలిసింది. పలు రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), సామాజిక కార్యకర్త మరియు వ్లాగర్ అయిన భగవాన్ సింగ్ అలియాస్ భానా సిద్ధూ, లూథియానా ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఏజెంట్‌ను బలవంతంగా దోపిడీ చేశాడనే ఆరోపణలపై జనవరిలో అరెస్టు చేశారు. 12 ఫిబ్రవరి 2024న మొహాలీ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

అలాగే అతర్వాత రెండో వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో యూట్యూబ్‌లో 17 జనవరి 2024 షేర్ అయినట్లు తెలిసింది.అయితే ఈ వీడియో ఏ సందర్భంలో తీసిందో తెలియలేదు, కానీ ఈ వీడియో ఇటీవల ఢిల్లీలో మొదలయిన రైతు నిరసనల కన్నా ముందే నుంచే సోషల్ మీడియాలో ఉంది . దీన్ని బట్టి ఈ వీడియోకి ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనలకు ఎలాంటి సంబంధం లేదని నిర్థారించవచ్చు. 

చివరగా, రైతు నిరసనలతో సంబంధంలేని వీడియోలను ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll