ముస్లిం యువకులు అమ్మాయిలకు కేక్‌లో మత్తుమందు ఇచ్చి వారిని ట్రాప్ చేస్తున్నారని అర్ధం వచ్చేలా చెప్తూ, దీనికి సంబంధించి ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం యువకులు అమ్మాయిలకు కేక్‌లో మత్తుమందు ఇచ్చి వారిని ట్రాప్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజమైన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి స్క్రిప్టెడ్ వీడియోలు అని పేర్కొంటూ వీడియో చివర్లో స్పష్టంగా ఒక డిస్‌క్లైమెర్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఇందులో ముస్లిం యువకులు అని కూడా ఎక్కడా చెప్పలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు,ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో యొక్క పూర్తి నిడివిగల వీడియోని ప్రముఖ నటి సంజన గల్రానీ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఐతే సంజన గల్రానీ ఈ వీడియోని షేర్ చేసిన పోస్టులో ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు స్పష్టంగా పేర్కొంది.
సంజన గల్రానీ షేర్ చేసిన పూర్తి వీడియో చివర్లో కూడా ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు స్పష్టంగా ఒక డిస్‌క్లైమెర్ కూడా ఉంది, పైగా సంజన గల్రానీ పోస్టులో వీడియోకి సంబంధించి ఎటువంటి మతపరమైన ఆరోపణలు చేయలేదు. ఐతే ఈ వీడియోలో డిస్‌క్లైమెర్ ఉన్న భాగాన్ని తీసేసి కేవలం మిగతా భాగాన్ని మతపరమైన కోణంలో ఒక మతానికి చెందినవారిని నిందిస్తూ షేర్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి పలు అవగాహన కల్పించే వీడియోలను ప్రముఖ వ్యక్తులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్న ట్రెండ్ పెరుగుతోంది. ఐతే ఈ వీడియోలను కొందరు డిస్‌క్లైమెర్ భాగాన్ని తీసేసి మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వీడియోలను FACTLY తప్పని చెప్తూ రాసిన ఫాక్ట్ చెక్ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ముస్లిం యువకులు అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి ట్రాప్ చేస్తున్నారంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.