Fake News, Telugu
 

హర్యానాలో సూట్‌కేసులో శవంగా దొరికిన అమ్మాయి ఫోటోలని జార్ఖండ్‌ రాష్ట్రానికి, లవ్ జిహాద్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

జార్ఖండ్‌ రాష్ట్రంలో లవ్ జిహాద్ భాదితురాలు సూట్‌కేసులో శవంగా దొరికిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. హిందూ మతాన్ని వదులుకొని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకున్న ముస్లిం అబ్బాయి కుటుంబ సభ్యులు లైంగికంగా వేధించి, ఆమెని హత్య చేసి శవాన్ని ఇలా సూట్‌కేసులో పెట్టి పడేసినట్టు పోస్టులో చెప్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: జార్ఖండ్‌లో సూట్‌కేసులో శవంగా దొరికిన లవ్ జిహాద్ భాదితురాలు యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్న శవం 2020 అక్టోబర్ నెలలో హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లాలోని ఫూల్కన్ గ్రామంలో దొరికింది. సూట్‌కేసులో శవంగా దొరికిన మహిళ ఆచూకి వివరాలు పోలీసులకు ఇప్పటివరకు తెలియరాలేదు. చనిపోయిన మహిళ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు గానీ, గృహ హింస కారణంగా చనిపోయినట్టు గానీ పోలీసులు నిర్ధారించలేదు. ఈ ఫోటోకి జార్ఖండ్‌ రాష్ట్రానికి కూస సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘పంజాబ్ కేసరి’ అనే వార్తా సంస్థ 10 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హర్యానా సిర్సా జిల్లాలో దొరికిన సూట్‌కేసులో ఒక మహిళ శవం భయటపడిందని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. సిర్సా జిల్లా ఫూల్కన్ గ్రామం మీదుగా వెళ్తున్న బన్మందరి మైనర్ కాలువలో ఈ సూట్ కేసు దొరికిందని ఆర్టికల్‌లో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుపుతూ ‘ధైనిక్ భాస్కర్’ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ సూట్‌కేసులోని శవాన్ని ఫూల్కన్ గ్రామస్థూలు ముందుగా చూసి పోలీసులకి సమాచారమిచ్చినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.  సూట్‌కేసులో శవంగా దొరికిన మహిళను గొంతు కోసి చంపివేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ చేసినట్టు తెలిసింది. సిర్సా జిల్లా డీఎస్పీ సంజయ్ కుమార్ ఈ హత్య ఘటన వివరాలని మీడియాకి తెలుపుతూ, బన్మందరి మైనర్ కాలువలో లభించిన మహిళా శవాన్ని డింగ్ పోలీస్ స్టేషన్ రికవర్ చేసుకుందని తెలిపారు. చనిపోయిన మహిళ వ్యక్తిగత సమాచారం ఇంకా పోలీసులకు తెలియలేదని సంజయ్ కుమార్ మీడియాకి స్పష్టం తెలిపారు.

ఈ హత్య ఘటనకు సంబంధించి సిర్సా జిల్లా డింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫైల్ అయిన FIRని ఇక్కడ చూడవచ్చు. ఈ FIRలో చనిపోయిన మహిళ వ్యక్తిగత సమాచారం ఎక్కడా తెలుపలేదు. అంతేకాదు, ఈ హత్య కేసుకి సంబంధించిన ఇప్పటివరకు లభించిన వివరాల కోసం డింగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశ్మీరీ లాల్‌ని సంప్రదిస్తే, చనిపోయిన మహిళ ఆచూకి వివరాలు ఇంకా తమకు తెలియలేదని స్పష్టం చేసారు. ఈ కేసుకి లవ్ జిహాద్ ముడిపెట్టడానికి ఎటువంటి ఆధారం లేదని కాశ్మీరీ లాల్‌ స్పష్టం చేసారు.

చివరగా, హర్యానాలో సూట్‌కేసులో శవంగా దొరికిన అమ్మాయి ఫోటోలని లవ్ జిహాద్‌కు, జార్ఖండ్‌ రాష్ట్రానికి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll