Fake News, Telugu
 

పుచ్చకాయలో రసాయనాలు చేర్చి అమ్ముతున్నారు అంటూ స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఒక వ్యక్తి పుచ్చకాయను ఎర్రగా, తియ్యగా మార్చేందుకు కెమికల్స్ వాడుతున్న సమయంలో పోలీసులకు దొరికిపోయిన వీడియో అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక వ్యక్తి పుచ్చకాయను ఎర్రగా, తియ్యగా మార్చేందుకు కెమికల్స్ వాడుతున్న సమయంలో పోలీసులకు దొరికిపోయిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వీడియో మొదట్లో ఒక disclaimer ద్వారా ఈ వీడియో నిజం కాదు అని, ఇది ఒక స్క్రిప్ట్ చేయబడిన వీడియో అని తెలుపబడింది. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తితో ఇటువంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు ‘సోషల్ మెసేజ్’ అనే ఒక ఫేస్బుక్ పేజీలో దొరికాయి. పైగా, ఈ పేజీ ప్రొఫైల్లో ‘ఈ పేజీలో పోస్ట్ చేయబడిన కొన్ని వీడియోలు స్క్రిప్టెడ్. ఇవి అవగాహన మరియు వినోదం కోసం రూపొందించబడినవి’ అని పేర్కొన్నారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోను పరిశీలిస్తే, వీడియో మొదట్లో ఒక disclaimer ద్వారా ఈ వీడియో నిజం కాదు అని, ఇది ఒక స్క్రిప్ట్ చేయబడిన వీడియో అని తెలుస్తుంది.

దీని గురించి మరింత తెలుసుకునేందుకు వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ‘సోషల్ మెసేజ్’ అనే ఫేస్బుక్ పేజీలో వైరల్ వీడియో 29 ఏప్రిల్ 2024 న షేర్ చేసినట్టు గమనించాం. ఇటువంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు ఈ పేజీలో దొరికాయి. అంతే కాకుండా, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి పలు వీడయోలలో ఉండడం మేము గమనించాం(ఇక్కడ మరియు ఇక్కడ). పైగా, ఈ పేజీ యొక్క ప్రొఫైల్లో ‘ఈ పేజీలో పోస్ట్ చేయబడిన కొన్ని వీడియోలు స్క్రిప్టెడ్. ఇవి అవగాహన మరియు వినోదం కోసం రూపొందించబడినవి’ అని పేర్కొనడం గమనించాం.

భారత ప్రభుత్వ ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా (FSSAI) వారు, ఇంట్లో ఆహార కల్తీని తనిఖీ చేయటానికి కొన్ని పద్ధతులను ప్రచురించింది. దీని ప్రకారం పుచ్చకాయలోని ఎర్రటి గుజ్జుపై కాటన్ బాల్‌ను కొన్ని సార్లు రుద్దితే, ఆ దూది ఎర్రగా మారినట్టయితే ఈ పుచ్చకాయలో ఎరిథ్రోసిన్ అనే రసాయనం చేరి ఉంటుందని అంచనా వేయవచ్చు. దానికి రంగు రాకపోతే, పుచ్చకాయ తినడానికి సురక్షితం అని సూచన.

చివరిగా, పుచ్చకాయలో రసాయనాలు చేర్చి అమ్ముతున్నారు అంటూ స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll