2015లో బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, కొందరు ‘దుర్మార్గులు’,’మతతత్వ వాదులు’ ఒక దళిత కుటుంబాన్ని నగ్నంగా నిలబెట్టారు అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫొటోని (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 2015లో బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో, కొందరు మతతత్వ వాదులు, ఒక దళిత కుటుంబాన్ని నగ్నంగా నిలబెట్టిన ఫోటో.
ఫ్యాక్ట్(నిజం): పోస్ట్‌లో షేర్ చేయబడిన ఫోటో 2015లో ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని డంకౌర్ పోలీస్ స్టేషన్ వెలుపల నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతున్న ఒక దళిత కుటుంబాన్ని చూపిస్తుంది. ఒక దోపిడీ ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆరోపిస్తూ, ఒక దళిత కుటుంబం బట్టలు విప్పి ఈ విధంగా నిరసన తెలిపింది. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా వారిని ఎవరు నగ్నంగా నిలబెట్టలేదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్ట్‌లో షేర్ చేయబడిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వైరల్ ఫోటో పూర్తి కాపీ 10 అక్టోబర్ 2015న ఇండియా టుడే ప్రచురించిన ఒక వార్తా కథనంలో మాకు లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని డంకౌర్ పోలీస్ స్టేషన్ వెలుపల నగ్నంగా నిరసన తెలుపుతున్న ఒక దళిత కుటుంబం దృశ్యాలు ఇవి అని ఈ వార్తా కథనం నివేదించింది. ఒక దోపిడీ ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆరోపించి వారు ఈ నిరసన తెలిపారని ఈ కథనం తెలిపింది.

ఈ సంఘటన వివరాలను తెలుపుతూ అనేక వార్తా సంస్థలు అక్టోబర్ 2015లో కథనాలను ప్రచురించాయి. వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, సునీల్ గౌతమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన పొరుగింటివాడైన మహావీర్‌పై ఒక దోపిడీ ఫిర్యాదు చేయడానికి డంకౌర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాడు. అతనితో ఆ కుటుంబానికి భూ వివాదం కూడా ఉంది. పోలీసులు తమ ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ, సునీల్ కుటుంబం డంకౌర్ పోలీస్ స్టేషన్ వెలుపల దుస్తులు విప్పి నిరసన తెలిపినట్లు ఈ కథనాల్లో పేర్కొన్నారు. ఆ తరువాత వారిని అరెస్టు చేసి అశ్లీలత కింద కేసు నమోదు చేశారు.
అయితే, మరికొన్ని కథనాలు ఆ దళిత కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా కొట్టి, బలవంతంగా వివస్త్రలను చేశారని పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, డంకౌర్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ, “వారు ఇలా చేయకుండా ఆపడానికి మేము అన్ని ప్రయత్నాలు చేసాము, వారి దుస్తులతో వారిని కప్పడానికి కూడా ప్రయత్నించాము. అయితే, మహిళా పోలీసు అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి వారు అప్పటికే ఇలా చేశారు” అని అన్నారు. అలాగే పోస్టులో చెప్తున్నట్టుగా 2015లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం లేదు, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉంది.

చివరగా, 2015లో ఉత్తరప్రదేశ్‌లో ఒక దళిత కుటుంబం నగ్నంగా నిరసన తెలుపుతున్న ఫోటోని, కొందరు బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టారు అని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.