Fake News, Telugu
 

తిరుమల నడకదారి భక్తుల భద్రత కోసం టీటీడీ అందించే కర్రలపై జగన్ స్టికర్ అంటూ ఒక మార్ఫ్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు.

0

తిరుమల నడకదారిలో దర్శనం కోసం వెళ్ళే భక్తుల భద్రత కోసం అందరికీ చేతికర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కర్రలకు దేవుడి ఫోటోలకు బదులు జగన్ ఫోటోలు అతికించారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుమల నడకదారి భక్తులకు టీటీడీ అందించే చేతికర్రలకు దేవుడి ఫోటోలకు బదులు జగన్ ఫోటోను అతికించారు.

ఫాక్ట్(నిజం): ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ఫోటో అమెజాన్‌ వెబ్‌సైట్‌ నుండి సేకరించింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌ నుండి సేకరించిన ఈ ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేసి, జగన్ ఫోటోను అతికించారు. ఇకపోతే, టీటీడీ వారు 16 ఆగష్టు 2023 నుండి భక్తులకు కర్రలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రకారం ఈ కర్రలపై ఎలాంటి ఫోటోలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మరణించడంతో భక్తుల భద్రత విషయంలో టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో ఉదయం 5 గం. నుంచి మధ్యాహ్నం 2గం. వరకే పిల్లలకు అనుమతి, కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి., ఘాట్ రోడ్లో వెళ్లే టూ-వీలర్ వాహనాలకు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి లాంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే భక్తులు వంద మంది బ్యాచ్‌లలో ఒక సెక్యూరిటీ గార్డుతో కలిసి వెళ్ళడం, మొదలైన నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగానే నడకదారిలో వెళ్ళే ప్రతీ భక్తుడికి తమ రక్షణ కోసం ఊతకర్ర కూడా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 16 ఆగష్టు 2023 నుండి భక్తులకు కర్రలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ప్రకారం ఈ కర్రలపై ఎలాంటి ఫోటోలు లేవు. కర్రలపై ముఖ్యమంత్రి జగన్ స్టికర్‌ను అతికించినట్టు మాత్రం ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు.

కాగా వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో అమెజాన్‌లోని ఫోటోకు మిర్రర్ ఇమేజ్. ఐతే అమెజాన్‌లోని ఫోటోలో కర్రలపై ఎటువంటి స్టికర్స్ లేవు. పైగా పై కథనంలో చూపించిన కర్రలు, అమెజాన్‌లోని కర్రల కన్నా బిన్నంగా ఉన్నాయి. దీన్నిబట్టి అమెజాన్‌లోని ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేసి జగన్ ఫోటోను అతికించినట్టు స్పష్టమవుతుంది.

చివరగా, తిరుమల నడకదారిలో భక్తుల భద్రత కోసం టీటీడీ అందించే కర్రలపై జగన్ స్టికర్ అంటూ ఒక మార్ఫ్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll