Fake News, Telugu
 

2020లో భోపాల్ పోలీసులు హుక్కా బారు పై నిర్వహించిన రైడ్‌లో హిందూ అబ్బాయిలు కూడా పట్టుబడ్డారు

0

Update (26 August 2022):
ఒక కాఫీ షాప్ సెల్లార్‌లో కొందరు అమ్మాయిలు అబ్బాయిలు సన్నిహితంగా ఉన్న సమయంలో పోలీసులు రైడ్ చేసిన వీడియోని షేర్ చేస్తూ, క్రింద పేర్కొన్న మధ్యప్రదేశ్ ఘటనకు కొందరు ముడిపెడ్తున్నారు. కానీ, వీడియోలోని ఘటన కొన్ని రోజుల క్రితం ఆగ్రాలో జరిగినట్టు రిపోర్ట్ అయ్యింది. ఈ రిపోర్టులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవొచ్చు. ఈ వీడియో వైరల్ అవడంతో అందుకు కారణం అయిన పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఆగ్రా పోలీసులు ట్వీట్ చేసారు.

Published (13 September 2021):

మధ్యప్రదేశ్ పోలీసులు ఇటీవల ఒక హుక్కా బార్ పై రెయిడ్ నిర్వహించి 30 మంది యువతీ యువుకులను పట్టుకున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ రెయిడ్లో పట్టుబడిన వారిలో 15 మంది హిందు అమ్మాయిలని, మిగితా 15 మంది ముస్లిం యువకులని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక హుక్కా బారుపై పోలీసులు ఇటీవల రెయిడ్ నిర్వహించి 15 మంది హిందు అమ్మాయిలు మరియు 15 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్న ఘటన 2020 జూలై నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలోని చోటుచేసుకుంది. 23 జూలై 2020 నాడు రాత్రి ట్రైలాజి అనే పబ్బులో లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువతీ యువకులను క్రైమ్ బ్రాంచ్, శాహ్పుర పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసారు. ఈ రెయిడ్లో మొత్తం ఏడుగురు అమ్మాయిలు పట్టుబడగా, వారిలో ఆరుగురు హిందూవులని భోపాల్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో తెలిపారు. అలాగే, పట్టుబడ్డ 26 మంది అబ్బాయిలలో 19 మంది ముస్లింలని, మిగతా ఏడుగురు హిందువులని భోపాల్ పోలీసులు తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన ఫోటో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘లైవ్ హిందూస్తాన్’ న్యూస్ వెబ్సైటు 24 జూలై 2020 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 23 జూలై 2020 నాడు హుక్కా బార్ పై రెయిడ్ నిర్వహించి 32 మందిని అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. శాహ్పుర పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ట్రైలాజి పబ్బులో లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువతీ యువకులను క్రైమ్ బ్రాంచ్, శాహ్పుర పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ రెయిడ్ కు సంబంధించి భోపాల్ పోలీసులు పెట్టిన ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు. లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించి అర్ధరాత్రి వేడుకలు జరుపుకున్న 32 మంది యువతి యువకులను అరెస్ట్ చేసినట్టు ఈ  ట్వీట్లో తెలిపారు. ఈ రెయిడ్ కు సంబంధించి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లింకుని ఈ ట్వీట్లో షేర్ చేసారు. కాని, ఈ ప్రెస్ నోట్ ప్రస్తుతం భోపాల్ పోలీస్ వెబ్సైటులో అందుబాటులో లేదు. 23 జూలై 2020 నాడు భోపాల్ పోలీసులు ట్రైలాజి పబ్బుపై నిర్వహించిన రైడ్ గురించి India TV వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేసిన 32 మందిలో ఏడుగురు అమ్మాయిలు ఉన్నట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

2020లో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ‘Vishwas’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ భోపాల్ పోలీసులని సంప్రదించారు. ట్రైలాజి పబ్బుపై నిర్వహించిన రెయిడ్లో ఏడుగురు (7) అమ్మాయిలు, 26 మంది అబ్బాయిలు పట్టుబడినట్టు భోపాల్ పోలిసులు ‘Vishwas’ సంస్థకు తెలిపారు. పట్టుబడిన ఈ ఏడుగురు అమ్మాయిలలో ఆరుగురు హిందు మతానికి చెందిన వారని భోపాల్ పోలీసులు స్పష్టం చేసారు. అలాగే, పట్టుబడ్డ 26 మంది అబ్బాయిలలో 19 మంది ముస్లింలని, మిగతా ఏడుగురు హిందువులని భోపాల్ పోలీసులు ‘Vishwas’ సంస్థకు తెలిపారు. ఈ రైడ్‌కు సంబంధించి భోపాల్ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌ని వారికి పంపారు. ‘Vishwas’ న్యూస్ సంస్థ ఈ వివరాలను రిపోర్ట్ చేస్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, 2020లో భోపాల్ పోలీసులు హుక్కా బారు పై నిర్వహించిన రైడ్‌లో హిందూ అబ్బాయిలు కూడా పట్టుబడ్డారు.

Share.

About Author

Comments are closed.

scroll