Fake News, Telugu
 

రష్యాలో జరిగిన, సంబంధం లేని ఒక పాత సంఘటన వీడియోని లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు

0

పెళ్లి తరువాత హిందూ అమ్మాయిని తన ముస్లిం భర్త ఎలా చితకబాదుతున్నాడో చూడండి, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ముస్లిం అబ్బాయిలను పిచ్చిగా ప్రేమించే హిందూ అమ్మాయిల దుస్థితి ఇదంటూ వీడియోలో తెలుపుతునారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లవ్ జిహాద్ బాధితురాలిని తన ముస్లిం భర్త చితకబాదుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, రష్యా దేశం క్రస్నోదర్ నగరంలో జరిగిన ఒక పాత సంఘటన దృశ్యాలని చూపిస్తుంది. ఉక్రెయిన్ అబ్బాయిని పెళ్ళిచేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయిన ఒక రోమేనియన్ అమ్మాయిని ఆమె కుటుంబసభ్యులు తిరిగి ఇంటికి తీసుకొచ్చి దయనీయంగా కొట్టిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదు అలాగే, ఈ ఘటనలో లవ్ జిహాద్ కొణమేమీ లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘మీడియా పోర్టల్ Bizon’ అనే ఫేస్‌బుక్ పేజీ 05 జూలై 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. రష్యాలో క్రిమియాన్ జిప్సీ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయిని వారి కుటుంబసభ్యులు నిర్దాక్షిణ్యంగా కొడుతున్న దృశ్యాలని ఈ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఉక్రెయిన్ అబ్బాయిని పెళ్ళిచేసుకోవడానికి ఇంటి నుండి పారిపొయినందుకు ఈ అమ్మాయిని ఆమె కుటుంబసభ్యులు కొట్టినట్టు వివరణలో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ ‘life.ru’ వార్తా సంస్థ 05 జూలై 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఘటన రష్యా దేశం క్రస్నోదర్ నగరంలో చోటుచేసుకుందని ఆర్టికల్‌లో తెలిపారు. తను ప్రేమించిన ఉక్రెయిన్ దేశస్థుడిని పెళ్ళిచేసుకోవడానికి ఈ రోమేనియన్ అమ్మాయి ఇంటి నుండి పారిపోయినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. పారిపోయిన ఈ అమ్మాయిని కుటుంబసభ్యులు పోలీసుల సహయంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చినట్టు తెలిసింది. పారిపోయే ముందు ఇంట్లో దాచి ఉంచిన డబ్బుని దొంగిలించిందని ఆరోపిస్తూ బాధితురాలి బంధువు ఒకరు ఆమెని ఇలా కొట్టినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బాధితురాలి కుటుంబం, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన క్రిమియన్ రోమా ఉప-జాతి సమూహానికి చెందిన వారని కొన్ని వెబ్సైటులలో తెలిపారు. కాని, బాధితురాలి పేరు, ఆమె మతానికి సంబంధించిన వివరాలని మేము స్వతంత్రంగా దృవికరించలేకపోయాము. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో భారత దేశానికి సంబంధించినది కాదని అలాగే, ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణమేమి లేదని  ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రష్యాకి సంబంధించిన పాత వీడియోని ఇప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll