ముస్లింలు హిందువుల గుళ్ళు కూల్చేస్తున్నారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి హిందూ దేవుళ్ళ విగ్రహం ఉన్న గోడను పగలగొడుతున్న దృశ్యాలు చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముస్లింలు హిందూ దేవాలయాలను పగలగొడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన అక్టోబర్ 2022లో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరులో జరిగింది. ఈ వీడియోలో వ్యక్తి పగలగొడుతున్నది ఒక దర్గా గోడని, హిందూ దేవాలయాన్ని కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఎల్‌ఆర్ కాలనీలో ఉన్న ‘హజ్రత్ బాజీ బాబా నిషాన్’ దర్గా. . ఇస్లాంలోకి మారిన ఒక వ్యక్తి తన భార్య జ్ఞాపకార్ధం ఇతర మతాల చిహ్నాలతో పాటు దీనిపై నాగదేవత చిహ్నాన్ని ఏర్పాటు చేసాడు. ఐతే భూవివాదం కారణంగానే దీనిని కూల్చే ప్రయత్నం చేసారే తప్ప ఇందులో మతపరమైన కోణమేది లేదని పోలీసులు స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియో స్క్రీన్ షాట్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ దృశ్యాలను 2022లో రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం వీడియోలో వ్యక్తి పగలగొడుతున్నది ఒక దర్గా, పోస్టులో చెప్తున్నట్టు ఒక హిందూ దేవాలయం కాదు.
ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఎల్‌ఆర్ కాలనీలో ఉన్న ‘హజ్రత్ బాజీ బాబా నిషాన్’ దర్గా. ఈ దర్గా ప్రహరీ గోడపై అన్ని మతాల చిహ్నాలు ఉన్నాయి.ఈ దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఐతే ఇక్కడ కొత్త మసీద్ నిర్మిస్తామంటూ ఈ దర్గాను 12 అక్టోబర్ 2022న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో దీనికి సంబంధించిందే.

పోలీసులు ఈ విషయమై విచారణ చేసి వివరణ ఇచ్చారు. పోలీసులు చెప్తున్నదాని ప్రకారం “ఏసు రత్నం అలియాస్ రెహమాన్ తన భార్య నాగరత్నమ్మతో కలిసి గుంటూరు ఎల్‌ఆర్ కాలనీలో ఉండేవాడు. సుమారు 40 సంవత్సరాల క్రితం అతని భార్య మరణించిన తరువాత, అతను ఒక దర్గా (స్మారక చిహ్నం) నిర్మించి అక్కడ ప్రార్థనలు చేశాడు. మతంతో సంబంధం లేకుండా అక్కడి వారందరు ఈ దర్గాను సందర్శించేవారు. కొన్ని సంవత్సరాల క్రితం యేసు రత్నం మరణించిన తరువాత, అతని కుమార్తె సత్యవతి మరియు సంగడి గుంటలోని సమీపంలోని మసీదు సభ్యులు యేసు రత్నం మరణించిన తర్వాత ఈ దర్గా స్థలంలో మసీదు నిర్మించాలని కోరుకున్నాడని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఐతే ఈ క్రమంలో 12 అక్టోబర్ 2022న, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించగా, స్థానికులు దానిని వ్యతిరేకించారు.”

అలాగే ఈ ఘటన అంతా భూ వివాదానికి సంబంధించిందే తప్ప మతపరమైన కోణమేది లేదు అని స్పష్టం చేసారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని కూడా తెలిపారు.“రెహ్మాన్ క్రైస్తవుడు కాగా ఆ తరవాత అతను ఇస్లాం మతంలోకి మారాడు. అతని భార్య పేరు నాగ రత్నమ్మ, అందుకే అతను ఇస్లాం చిహ్నాలతో పాటు హిందూ చిహ్నం అయిన నాగదేవత (పాముల) విగ్రహాన్ని గోడపై ఏర్పాటు చేసాడు” అని BOOMకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులు తెలిపారు.
చివరగా, దర్గా కూల్చే ప్రయత్నానికి సంబంధించిన పాత వీడియోను హిందూ దేవాలయాన్ని కూల్చేస్తున్నారు అంటూ షేర్ చేస్తున్నారు.