Fake News, Telugu
 

గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టు “Way2News” ప్రచురించలేదు

0

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో, అక్టోబర్ 26 రాత్రి హైదరాబాద్ నగర శివార్లలో నలుగురు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కను సైగల్లోనే జరిగింది అని అచ్చంపేట MLA గువ్వల బాలరాజు చెప్పినట్లు “Way2News” పేరుతో ఉన్న ఒక పోస్టు బాగా ప్రచారంలో ఉంది. దీనిలో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కను సైగల్లోనే జరిగింది అని అచ్చంపేట MLA గువ్వల బాలరాజు చెప్పినట్లు “Way2News” పేరుతో ఉన్న పోస్టు.

ఫాక్ట్: తమ సంస్థ ‘లోగో’ ని వాడుకొని ఎవరో వ్యక్తులు ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారు అని, ఈ పోస్టుని తాము ప్రచురించలేదని “Way2News” వారు వివరణ ఇచ్చారు.  కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా “Way2News” సంస్థకు చెందిన అధికారిక ట్విటర్ ఖాతా పరిశీలించగా వారు వైరల్ అవుతున్న ఈ పోస్టుని ఎవరో వ్యక్తులు తమ సంస్థ ‘లోగో’ ని వాడుకొని ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, ఈ పోస్టుని తాము ప్రచురించలేదని స్పష్టం చేశారు.

ఇక పోస్టులో ఉన్న MLA బాలరాజు ఫోటో ఆగస్టు 2021కి చెందినది. దీనిని ‘TV9 Telugu’ వెబ్‌సైటులో చూడవచ్చు.

మరియు అక్టోబర్ 26 రాత్రి జరిగిన ఘటన తర్వాత బాలరాజు మరియు ఇతర ఎమ్మెల్యేలు మీడియాతో  ప్రత్యేకంగా సమావేశం కాలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మళ్ళీ వివరంగా సమాధానం ఇస్తాను అని “ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తెరాస పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తుంది” అని చెప్పారు.

చివరిగా, గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు అంటూ వైరల్ అవుతున్న ఈ పోస్ట్ “Way2News” ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll