భారత ప్రభుత్వం క్వాంటం ఏఐ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించిందని, ఇందులో రూ. 21,000 పెట్టుబడి పెడితే ఒక్క నెలలో రూ. 2,00,000 ఆదాయం వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా ఉన్న వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారత ప్రభుత్వం ప్రారంభించిన క్వాంటం ఏఐ అనే వెబ్‌సైట్‌లో రూ. 21,000 పెట్టుబడి పెడితే ఒక్క నెలలో రూ. 2,00,000 ఆదాయం వస్తుందని చెప్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఫాక్ట్: ఇది ఒక డీప్ ఫేక్ వీడియో. క్వాంటం ఏఐ వంటి వెబ్‌సైట్లలో పెట్టుబడి పెట్టమని రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అలాగే, భారత ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని/ వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని (ఇక్కడ & ఇక్కడ) 07 మార్చి 2025న ‘ఇండియా టుడే కాంక్లేవ్’ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. అయితే, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, డీలిమిటేషన్, కుల గణన, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వీడియోలో ఎక్కడా కూడా క్వాంటం ఏఐ వంటి వెబ్‌సైట్లలో పెట్టుబడి పెట్టమని ఆయన చెప్పలేదు.

ఇక వైరల్ వీడియోని పరిశీలించగా, అసలు వీడియోతో పోలిస్తే ఇందులో రేవంత్ రెడ్డి వాయిస్ అసహజంగా ఉండడం వినవచ్చు. అలాగే, లిప్ సింక్ కూడా సరిగా లేదని చూడవచ్చు. దీన్ని బట్టి, వైరల్ వీడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా సృష్టించారని చెప్పవచ్చు. అదనంగా, AI వీడియోలు, ఆడియోలను గుర్తించే Hive వంటి సాధనాలు కూడా వైరల్ వీడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్ AI ద్వారా రూపొందించబడినదని నిర్ధారించాయి.

అలాగే, వైరల్ పోస్టు కింద ఇచ్చిన వెబ్‌సైట్ వివరాలను పరిశీలించగా, ఇది 08 జూలై 2025న రిజిస్టర్ చేయబడినటువంటి అనుమానాస్పద వెబ్‌సైట్‌గా(ఆర్కైవ్) గుర్తించాం.

గతంలో కూడా నిర్మలా సీతారామన్, ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, ద్రౌపది ముర్ము, సుధా మూర్తి తదితరులు ఇటువంటి నకిలీ వెబ్‌సైట్లను ప్రమోట్ చేస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటికి సంబంధించి మేము రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. భారత ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని, వెబ్‌సైట్లను ప్రారంభించలేదని, సోషల్ మీడియా యూజర్ల డబ్బుని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు ఇటువంటి ఫేక్ వెబ్సైట్లను, డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారని, వీటిని నమ్మి డబ్బులు పంపవద్దని PIB ఫాక్ట్ చెక్ అనేక సార్లు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) హెచ్చరించింది.
చివరిగా, క్వాంటం ఏఐలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా ఒక డీప్ ఫేక్ వీడియో ప్రచారంలో ఉంది.