జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (JKPDP) అధినేత్రి, జమ్మూ కశ్మీర్ర్ మాజీ ముఖ్యమంత్రి, మెహబూబా ముఫ్తీ, తన తండ్రి తమ్ముడిని పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. ‘బాబాయ్ మొగుడు అయ్యాడు. తన పిల్లలకు తాత వరస కావాల్సిన వాడు, సొంత తండ్రి అయ్యాడు. ముఫ్తి తండ్రికి తమ్ముడు, ముఫ్తి తండ్రికి అల్లుడు అయ్యాడు’, అంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మెహబూబా ముఫ్తీ తన తండ్రి తమ్ముడిని (అంటే వరసకు బాబాయ్) పెళ్లి చేసుకుంది.
ఫాక్ట్ (నిజం): మెహబూబా ముఫ్తీ 1984లో తన మామ వరస అయిన జావేద్ ఇక్బాల్ షాను పెళ్లాడింది. మెహబూబా ముఫ్తీ జావేద్ ఇక్బాల్ షాతో విడాకులు తీసుకొని ప్రస్తుతం విడిగా జీవిస్తున్నారు. మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కు జావేద్ ఇక్బాల్ షా తండ్రి మేనమామ అవుతాడు. దీనిబట్టి, మెహబూబా ముఫ్తీకు జావేద్ ఇక్బాల్ షా మామ వరస అవుతాడని స్పష్టమయింది. పోస్టులో తెలుపుతున్నట్టు మెహబూబా ముఫ్తీ తన తండ్రి తమ్ముడిని పెళ్లి చేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సమాచారం కోసం కి పదాలను ఉపయోగించి వెతికితే, మెహబూబా ముఫ్తీ వివాహ బంధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ ‘న్యూస్ 18 వార్తా’ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. మెహబూబా ముఫ్తీ 1984లో తన మామ వరస అయిన జావేద్ ఇక్బాల్ షాను వివాహం చేసుకుందని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ జావేద్ ఇక్బాల్ షాతో విడాకులు తీసుకొని ప్రస్తుతం విడిగా జీవిస్తున్నారని తెలిసింది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, జావేద్ ఇక్బాల్ షా, తనకు ముఫ్తీ ముహమ్మద్ సయీద్ కు మధ్య ఉన్న బంధుత్వాన్ని ఒక సభలో వివరించినట్టు తెలిసింది. 2019లో జరిగిన ‘IndoiAnalytics’ కాన్‌క్లెవ్‌లో జావేద్ ఇక్బాల్ షా ప్రసంగిస్తూ, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కు తన తండ్రి మేనమామ అవుతాడని తెలిపారు. ధీని ఆధారంగా జావేద్ ఇక్బాల్ షాకు ముఫ్తీ మహమ్మద్ సయీద్ బావ వరుస అవుతారని, మెహబూబా ముఫ్తీ కోడలు వరుస అవుతారని స్పష్టమయ్యింది.
జావేద్ ఇక్బాల్ షా మెహబూబా ముఫ్తీ కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడని, పెళ్లి ప్రస్తావనను ముందుగా మెహబూబా జావేద్‌తో ప్రతిపాదించారని ‘ది టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. పై వివరాల ఆధారంగా మెహబూబా ముఫ్తీ తన తండ్రి తమ్ముడిని పెళ్లాడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన తండ్రి సోదరుడిని పెళ్లాడలేదు.