Fake News, Telugu
 

దేశ ప్రజలు 90 రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని నరేంద్ర మోదీ సందేశమిచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ సమాచారం ఫేక్

0

విదేశీ వస్తువులను, ముఖ్యంగా చైనా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులను, 90 రోజుల పాటు కొనవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల సందేశమిచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. భారతీయులందరు 90 రోజులు విదేశీ వస్తువులు కొనకుంటే, భారత్ ప్రపంచంలోనే రెండవ సంపన్న దేశంగా అవతరించగలదని, కేవలం 90 రోజుల్లో 2 రూపాయల భారత కరెన్సీ ఒక డాలర్‌కు సమానమవుతుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, గతేడాది దీపావళి పండగ సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనడం ద్వారా 20% చైనా వస్తువులు వృధా అయ్యాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశ ప్రజలు 90 రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని నరేంద్ర మోదీ సందేశమిచ్చారు.

ఫాక్ట్ (నిజం): గతంలో పలు సందర్భాలలో దేశ ప్రజలు స్వదేశీ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కి బాత్’ మరియు ఇతర మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు. భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడమే లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామే తప్ప, తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. 90 రోజులు విదేశీ వస్తువులను కొనకుంటే, భారత్ ప్రపంచంలోనే రెండవ సంపన్న దేశంగా అవతరిస్తుందని గానీ, భారత కరెన్సీ రెండు రూపాయలు ఒక డాలర్‌కు సమానమవుతుందని గానీ నరేంద్ర మోదీ అనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను 90 రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని పిలుపూనిచినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. 90 రోజులు విదేశీ వస్తువులను కొనకుంటే, భారత్ ప్రపంచంలోనే రెండవ సంపన్న దేశంగా అవతరిస్తుందని గానీ, భారత కరెన్సీ రెండు రూపాయలు ఒక డాలర్‌కు సమానమవుతుందని గానీ నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు.

దీపావళి పండగ సందర్భంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ పిలుపునివ్వడం ద్వారా చైనా 50 వేల కోట్ల నష్టం చూసిందని న్యూస్ 18 వార్తా సంస్థ 01 నవంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. 2021లో దీపావళి పండగ సందర్భంగా ‘లోకల్ ఫర్ వోకల్’ మంత్రంగా స్వదేశీ మరియు స్థానిక వస్తువులను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ ‘మన్ కి బాత్’ కార్యక్రమం ద్వారా పునరుద్ఘాటించారని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడమే లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామే తప్ప, తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారని ఈ ఆర్టికల్‌ చివరిలో తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రజలు ప్రోత్సహించాలని గతంలో అనేక  సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపినిచ్చారు.

దీపావళి సందర్భంగా భారత దేశంలో తయారు చేసే ఉత్పత్తులని మాత్రమే కొనుగోలు చేయాలని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశమంటూ గతంలో సోషల్ మీడియాలో ఒక లెటర్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పేరుతో షేర్ చేస్తున్న ఆ లెటర్లు ఫేక్ అని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ సమాచారం ఫేక్ అని పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.  

చివరగా, దేశ ప్రజలు 90 రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని నరేంద్ర మోదీ సందేశమిచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ సమాచారం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll