కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మాస్క్ ధరించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఒక చిన్నపిల్లాడికి మాస్క్ ఎలా ధరించాలో నేర్పుతున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఒక చిన్నపిల్లాడికి మాస్క్ ఎలా ధరించాలో నేర్పుతున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో నవంబర్ 2019లో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యం నుంచి రక్షణ కోసం స్కూల్ పిల్లలకి ఉచిత మాస్కులు అందించిన కార్యక్రమానికి సంబంధించింది. ఈ ఫోటోలో అరవింద్ కేజ్రివాల్ చిన్న పిల్లాడికి మాస్క్ అందిస్తున్నది కాలుష్యం నుంచి రక్షణ కోసం, కరోనా వైరస్ కోసం కాదు. ఈ ఫోటో భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందు తీసినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ని షేర్ చేస్తూ 01 నవంబర్ 2019 నాడు పబ్లిష్ అయిన ఆర్టికల్ దొరికింది. ఢిల్లీ లో పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం, స్కూల్ పిల్లలకి 50 లక్షల ఉచిత మాస్కులు అందించే కార్యక్రమం చేపట్టినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా స్కూల్ పిల్లలకి మాస్కులు అందిస్తున్న ఫోటో అని వివరణలో తెలిపారు.
ఈ ఫోటోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), 01 నవంబర్ 2019 నాడు పెట్టిన ట్వీట్ లో షేర్ చేసారు. కాలుష్యం నుంచి రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 50 లక్షల మాస్కులు అందించే కార్యక్రమాన్ని అరవింద్ కేజ్రివాల్ చేపట్టినట్టు ఈ ట్వీట్ లో తెలిపారు.
ఈ ఫోటోని షేర్ చేస్తూ నవంబర్ 2019లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. భారత దేశంలో 30 జనవరి 2020 నాడు మొట్టమొదటి కరోన కేసు నమోదైంది. ఈ ఫోటో భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందు తీసినదని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 2019లో ఢిల్లీ కాలుష్యం నుంచి రక్షణ కోసం అరవింద్ కేజ్రివాల్ స్కూల్ పిల్లలకి ఉచిత మాస్కులు అందిస్తున్న ఫోటోని కరోనా వైరస్ నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.