బీహార్ లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల సభకి వచ్చిన జన సమూహం, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీహార్ లో 2020 ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ సభకి వచ్చిన జన సమూహం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా కోలకతా నగరంలో నిర్వహించిన ‘Jan Chetan Sabha’ కు సంబంధించినది. ఈ ఫోటోకి బీహార్ లో జరుగనున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటో నరేంద్ర మోదీ 2014లో నిర్వహించిన ‘Jan Chetan Sabha’ కు సంబంధించిందని అందులో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులోని ఈ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Desh Gujarat’ న్యూస్ వెబ్ సైట్ ‘05 ఫిబ్రవరి 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఫోటో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా కోలకతా నగరంలో నిర్వహించిన ‘Jan Chetan Sabha’ కు సంబంధించినదని ఈ ఆర్టికల్ లో తెలిపారు. నరేంద్ర మోదీ నిర్వహించిన ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘India Today’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో బీహార్ ఎన్నికలకి మరియు యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించింది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, నరేంద్ర మోదీ 2014లో నిర్వహించిన సభకి సంబంధించిన ఫోటోని చూపిస్తూ బీహార్ లో యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన ఎన్నికల సభ అని షేర్ చేస్తున్నారు.