వివరణ (29 January 2025): ఈ ఆర్టికల్ వైరల్ ఫోటోపై నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన వివరణతో అప్డేట్ చేయటం జరిగింది.
2025 మహా కుంభమేళా 13 జనవరి 2025న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమైంది. ఈ మహోత్సవం 26 ఫిబ్రవరి 2025న శివరాత్రి నాడు ముగుస్తుంది. ఈ 2025 మహా కుంభమేళాలో ఇప్పటికే వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, సినీ నటుడు అనుపమ్ ఖేర్, ఇన్ఫోసిస్ వ్యవస్థపాకులు నారాయణ మూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొని పవిత్ర స్నానం ఆచరించారు (ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు” అంటూ ఫోటోఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న 2025 మహా కుంభమేళాలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసే సమయానికి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ 2025 కుంభమేళాలో పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు/వార్తాకథనాలు లేవు. ఈ వైరల్ ఫోటోపై నటుడు ప్రకాష్ రాజ్ తన అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఈ ఫోటో ఫేక్ అని స్పష్టం చేశారు. అలాగే, వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి రూపొందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ పోస్టులో చెప్పినట్లుగా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళాలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆయన 2025 కుంభమేళాలో పాల్గొన్నట్లు తెలిపే ఎటువంటి వార్తా కథనాలు/రిపోర్ట్స్ మాకు లభించలేదు.
తదుపరి, మేము ప్రకాష్ రాజ్ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఆయన 2025 కుంభమేళాలో పాల్గొన్నట్లు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. అలాగే వైరల్ అవుతున్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఈ ఫోటోలతో కూడిన విశ్వసనీయ వార్తా కథనాలు కూడా మాకు లభించలేదు.
ఇకపోతే ఈ వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది ఏమో అనే అనుమానంతో మేము ఈ వైరల్ ఫోటో AI-జనరేటెడ్? కాదా? అని నిర్ధారించడానికి, Hive, wasitAI, Sightengine వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 99.9% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Hive ఫలితాన్ని ఇవ్వగా, ఈ ఫోటో 99% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Sightengine ఫలితాన్ని ఇచ్చింది. అలాగే wasitAI కూడా ఇది AI- జనరేటెడ్ ఫోటో అని ఫలితాన్ని ఇచ్చింది.



ఈ వైరల్ ఫోటో గురించి ఆసియానెట్ న్యూస్ కన్నడ ప్రకాష్ రాజ్ లీగల్ టీంను సంప్రదించినప్పుడు, వారు ఈ వైరల్ ఫోటో నకిలీదని పేర్కొన్నారని ఆసియానెట్ న్యూస్ 27 జనవరి 2025న ప్రచురించిన ఒక కథనంలో పేర్కొంది.
ఈ వైరల్ ఫోటోపై నటుడు ప్రకాష్ రాజ్ తన అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, “ఈ ఫోటో ఫేక్ అని మరియు దీని పై పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని పేర్కొన్నారు.
ఇంతకుముందు కూడా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ వంటి పలువురు సెలెబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్న దృశ్యాలు అంటూ పలు AI-జనరేటెడ్ ఫోటోలు వైరల్ కాగా, వాటిని తప్పని చెప్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2025 మహా కుంభమేళాలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారని పేర్కొంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు.