Fake News, Telugu
 

1952 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన అంబేడ్కర్, ఆ తర్వాత జన సంఘ్ సహాకారంతో రాజ్యసభకు ఎన్నికయ్యాడన్న వాదనలో నిజం లేదు

0

‘1952 పార్లమెంట్ ఎన్నికల్లో నెహ్రు అంబేడ్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తే, జనసంఘ్ పార్టీ సహాయంతో అంబేడ్కర్ రాజ్యసభకి వెళ్లారు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘1952 పార్లమెంట్ ఎన్నికల్లో నెహ్రు అంబేడ్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తే, జన సంఘ్ పార్టీ సహాయంతో అంబేడ్కర్ రాజ్యసభకి వెళ్లారు’.

ఫాక్ట్ (నిజం): 1952 పార్లమెంట్ ఎన్నికల్లో అంబేడ్కర్ నార్త్ బొంబాయి లోక్ సభ స్థానానికి పోటి చేసి ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్. కాజ్రోల్కర్ గెలుపొందారు. ఆ తర్వాత 1952లో బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఐతే, 1952లో బొంబాయి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో భారతీయ జన సంఘ్ (BJS) పార్టీ రెండు స్థానాల్లో పోటి చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు, అంటే ఆ పార్టీకి అప్పటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, అలాంటప్పుడు జన సంఘ్ సహాకారంతో అంబేడ్కర్ రాజ్య సభకి ఎన్నికయ్యాడన్న వాదనలో హేతుబద్దతే లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికలు అక్టోబర్ 1951 మరియు ఫిబ్రవరి 1952 మధ్య ఐదు నెలల పాటు జరిగాయి. ఈ ఎన్నికల ముందు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుండి విడిపోయి భారతీయ జన సంఘ్‌ని స్థాపించారు. అదేవిధంగా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ను (SCF) ఏర్పాటు చేసి నార్త్ బొంబాయి నుండి లోక్ సభకి పోటి చేసారు.

ఐతే ఈ ఎలక్షన్ లో అంబేడ్కర్ ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్. కాజ్రోల్కర్ గెలుపొందారు. పైగా ఈ ఎలక్షన్ లో అంబేడ్కర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత అంబేడ్కర్ బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభలోకి  (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) ప్రవేశించారు. ఆ తర్వాత 1954 భండారా లోక్ సభ నియోజికవర్గానికి జరిగిన ఉపఎన్నికలో రెండోవసారి పోటీ చేసి కూడా అంబేడ్కర్ ఓడిపోయారు.

అంబేడ్కర్ రాజ్యసభ ప్రాతినిధ్యం – జన సంఘ్ మద్దతు?

రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర జనాభా ఆధారంగా రాష్ట్రానికి రాజ్యసభ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇలా కేటాయించిన సీట్లకు ప్రతినిధులను లోక్ సభలో లాగా నేరుగా ప్రజలు ఎన్నుకోకుండా సింగల్ ట్రాన్స్ఫరెబల్ వోట్ పద్దతిలో ఆయా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు.

పైన తెలిపినట్టు అంబేడ్కర్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత 1952లో బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎన్నికయ్యాడు.  ఐతే అంబేడ్కర్ బొంబాయి అసెంబ్లీ నుండి రాజ్యసభకి ఎన్నికవ్వాలంటే ఆ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కాని 1951లో బొంబాయి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జన సంఘ్ (BJS) రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. దీన్నిబట్టి, జన సంఘ్ మద్దతుతో అంబేడ్కర్ రాజ్యసభకి ఎన్నికయ్యాడనే వాదనే ఉత్పనం అవ్వదు.

పైగా 1951 బొంబాయి అసెంబ్లీ ఎన్నికల్లో అంబేడ్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ను (SCF) పార్టీ 37 స్థానాల్లో పోటి చేస్తే కేవలం ఒక్క చోటే గెలిసింది, కాబట్టి తమ సొంతంగా కూడా అంబేడ్కర్ రాజ్య సభకి ఎన్నికయ్యే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) 269 స్థానాల్లో గెలుపొందగా, 18 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు, పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (PWP)కి చెందిన 14 మంది గెలుపొందారు. దీన్నిబట్టి అంబేడ్కర్ రాజ్యసభకి ఎన్నికవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మద్దతిచ్చి ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.

1952 ఎన్నికలకు సంబంధించి అంబేడ్కర్ యొక్క షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ను (SCF) పార్టీ మేనిఫెస్టోలో హిందూ మహాసభ లేదా ఆర్ఎస్ఎస్ (RSS) వంటి ఏ రియాక్షనరి పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని పెర్కొనట్టు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్: రచనలు మరియు ప్రసంగాలు, సం. 17లో రాసి ఉంది. దీన్నిబట్టి కూడా జన సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల పట్ల అంబేడ్కర్ వైఖరిని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, 1952 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన అంబేడ్కర్, ఆ తర్వాత జన సంఘ్ సహాకారంతో రాజ్యసభకు ఎన్నికయ్యాడన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll