Fake News, Telugu
 

2011లో మెక్సికోలో ప్రదర్శనకు ఉంచిన పోప్ జాన్ పాల్ II మైనపు బొమ్మ వీడియోని ఇటీవల వెలికితీసిన జాన్ పాల్ మృతదేహం దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

పోప్ జాన్ పాల్ II మృతదేహాన్ని 12 సంవత్సరాల తరువాత బయటకు తీసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. 12 సంవత్సరాల తరువాత జాన్ పాల్ II మృతదేహాన్ని బయటకు తీస్తే, అతని శరీరం చెక్కుచెదరకుండా కనిపించిందంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పోప్ జాన్ పాల్ II మృతదేహాన్ని 12 సంవత్సరాల తరువాత ఇటీవల బయటకు తీసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2011లో మెక్సికో దేశంలో ప్రదర్శించబడిన పోప్ జాన్ పాల్ II మైనపు బొమ్మని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు ఈ వీడియోలో కనిపిస్తున్నది పోప్ జాన్ పాల్ II మృతదేహం కాదు, మైనపు బొమ్మ. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని 2011లో పలు యూట్యూబ్ యూసర్లు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2011లో మర్సిడీస్ పాఠశాలలో ప్రదర్శనకు ఉంచిన పోప్ జాన్ పాల్ II అవశేషాల దృశ్యాలంటూ ఈ యూసర్లు వీడియోని షేర్ చేస్తూ తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇదే దృశ్యాన్ని చూపిస్తున్న ఫోటోని 2011లో ‘Alamy’ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2011లో మెక్సికో దేశంలో ప్రదర్శనకు పెట్టిన పోప్ జాన్ పాల్ II మైనపు బొమ్మ చిత్రమంటూ ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు.  

2011లో మైనంతో (వాక్స్) తయారు చేసిన పోప్ జాన్ పాల్ II బొమ్మని మెక్సికో దేశంలోని 90 నగరాలలో ప్రదర్శించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.   

02 ఏప్రిల్ 2005 నాడు పోప్ జాన్ పాల్ II మరణించారు. 29 ఏప్రిల్ 2011 నాడు పోప్ జాన్ పాల్ II మృతదేహం కలిగి ఉన్న శవపేటికను బీటిఫికేషన్‌ కోసం వెలికితీశారు. 2011లో వెలికి తీసిన పోప్ జాన్ పాల్ II శవపేటిక ఫోటోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలలో పోప్ జాన్ పాల్ II మృతదేహాన్ని శవపేటిక నుండి బయటకు తీసినట్టు ఎక్కడా కనిపించలేదు. అలాగే, జాన్ పాల్ II మృతదేహాన్ని ఇటలీ నుండి మెక్సికోకు తరలించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.  

చివరగా, 2011లో మెక్సికోలో ప్రదర్శనకు ఉంచిన పోప్ జాన్ పాల్ II మైనపు బొమ్మ వీడియోని ఇటీవల వెలికితీసిన జాన్ పాల్ మృతదేహం దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll