కేరళ వరదలకు తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసిన ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళ వరద పరిస్థితికి చలించి తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసిన క్రిస్టియానో రొనాల్డో.
ఫాక్ట్: క్రిస్టియానో రొనాల్డో కేరళ వరద పరిస్థితికి చలించి తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. న్యూస్ ఆర్టికల్స్ లో గానీ, క్రిస్టియానో రొనాల్డో యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌లో గానీ కేరళకు విరాళం ఇచ్చినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, క్రిస్టియానో రొనాల్డో అంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలా ఇచ్చుంటే, దాదాపు అన్ని వార్తాపత్రికలు దీని గురుంచి ప్రచురించేవి. అంతే కాదు, కేరళ వరద పరిస్థితికి చలించి 77 కోట్లు విరాళం అందచేసుంటే క్రిస్టియానో రొనాల్డో యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా సమాచారం లభించేది; కానీ ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్‌లో కేరళకు విరాళం ఇచ్చినట్టు ఎక్కడా తెలపలేదు.
పడకలు, వెంటిలేటర్లు సరఫరా చేయడానికి పోర్చుగల్‌లోని ఆసుపత్రులకు దాదాపు ఒక మిలియన్ యూరోలను విరాళంగా ఇచ్చాడు క్రిస్టియానో రొనాల్డో. ప్రతి సీజన్ చివరలో ఐరోపాలో టాప్-స్కోరర్ కు ప్రధానం చేసే గోల్డెన్ బూట్ వేలం వేసి ఒక మిలియన్ యూరోలకు పైగా సేకరించాడు. ఈ నిధులు గాజాలో పాఠశాలలను నిర్మించడానికి ఉపయోగించారు. కానీ, కేరళ వరదలకు తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసినట్టు ఎటువంటి సమాచారం గానీ, ఆధారాలు గానీ లేవు.

చివరగా, క్రిస్టియానో రొనాల్డో కేరళ వరద పరిస్థితికి చలించి తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.